న్యూఢిల్లీ, అక్టోబరు29,అర్జున్ సమాచారం:
నాలుగు ప్రధాన రాష్ట్రాల్లోని శాసనమండలి ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్ వేదికగా విసిరిన సెటైర్ వైరల్ అవుతోంది. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తూ బ్యాలెట్ ఎన్నికలు కావాలంటున్న కాంగ్రెస్ కు తన ట్వీట్ తో మంట పుట్టించారు మోదీ. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక వంటి నాలుగు పెద్ద రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పైగా ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరిగాయి.. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఊహించండి? అంటూ ప్రధాని మోదీ సంధించిన ప్రశ్న నెట్టింట వైరల్ అవుతోంది. ఏ ఎన్నికల్లో ఓడిపోయినా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పై నెపం నెట్టేసే కాంగ్రెస్ పార్టీకి.. బ్యాలెట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడాన్ని పరోక్షంగా ఎత్తిచూపుతూ మోదీ వేసిన సెటైర్ కాంగ్రెస్‌కు సూటిగా తగులుతోంది.ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించగా, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన నాలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక పూర్తిగా జీరో వద్దే చతికిలపడింది. సొంతంగా అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ కాంగ్రెస్‌కు పరాభవం తప్పలేదు. అక్కడ బీజేపీ-జేడీఎస్ కూటమి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్రల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతతో విజయఢంకా మోగించారు. విద్యావంతులు, పట్టభద్రులు, ఉపాధ్యాయ వర్గాలు ఓటర్లుగా ఉన్న ఈ స్థానాల్లో కాంగ్రెస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడం ఆ పార్టీ కేడర్‌ను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టింది.కాంగ్రెస్ పార్టీ , ఇండియా కూటమి పక్షాలు ఎన్నికల ఓటములను కప్పిపుచ్చుకునేందుకు ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలను ప్రధాన అస్త్రంగా వాడుతున్నాయి. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ఈవీఎంలను తొలగించి మళ్లీ పాత పద్ధతి అయిన బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు నిరంతరం ఉద్యమిస్తున్నారు. విపక్షాలు కోరుకున్నట్లుగానే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించినా ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారన్న నిజాన్ని ప్రధాని మోదీ తనదైన శైలిలో తేటతెల్లం చేశారు. ఓటమికి కారణం యంత్రాలు కాదని, కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలేనన్న స్పష్టమైన సంకేతాన్ని ఆయన ఈ చిన్న ట్వీట్‌తో దేశ ప్రజల ముందుంచారు.బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ జరిగినా ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్.. ఇకపై దేనిని బూచిగా చూపిస్తుందో చెప్పాలంటూ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఎదురుదాడి ప్రారంభించారు. ప్రధాని మోదీ సంధించిన ఈ ఒక్క చురకతో అటు కాంగ్రెస్ నైతిక స్థైర్యం దెబ్బతినడమే కాకుండా, రాబోయే రోజుల్లో ఈవీఎంలపై రచ్చ చేసేందుకు విపక్షాలకు రాజకీయంగా నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్ కు సున్నా…
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన శాసనమండలి సభ్యుల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి నిరాశను మిగిల్చాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 28 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక బోణీ కొట్టకుండానే వెనుదిరిగింది. మరీ ముఖ్యంగా తమ సొంత పాలనలో ఉన్న కర్ణాటకలో సీటింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం కోల్పోవడం ఆ పార్టీకి మింగుడుపడని పరిణామంగా మారింది. అధికారం చేతిలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఓటమిని మూటగట్టుకోవడం హస్తం పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఈ ఎమ్మెల్సీ ఎన్నికలన్నీ బ్యాలెట్ పత్రాల ద్వారానే జరుగుతాయి. సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రత్యక్షంగా సమగ్ర ప్రజాతీర్పును ప్రతిబింబించనప్పటికీ, ప్రాంతీయంగా రాజకీయ సమీకరణాలు, అధికార పంపిణీ , పార్టీ సంస్థాగత బలాబలాలను అంచనా వేయడానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తాయి. ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పట్టభద్రులు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికల్లో 28కి ఒక్క సీటు కూడా సాధించలేకపోవడం కాంగ్రెస్ క్షేత్రస్థాయి మేనేజ్మెంట్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. మిత్రపక్షాలతో సమన్వయం లోపించడం, ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టలేకపోవడమే ఈ ఘోర పరాభవానికి ప్రధాన కారణమం.పార్టీ అగ్రనాయకత్వం జాతీయ స్థాయి రాజకీయాలు, ర్యాలీలపైనే ఎక్కువ దృష్టి పెడుతూ క్షేత్రస్థాయిలోని నెట్‌వర్క్‌ను పూర్తిగా గాలికి వదిలేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బూత్ స్థాయి నుంచి స్థానిక సంస్థల వరకు బలమైన యంత్రాంగం లేకపోవడం వల్లనే ఇటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ తేలిపోతోంది. ప్రతిపక్షాల వ్యూహాత్మక ఓటింగ్, ఆకర్షణీయమైన అభ్యర్థుల ఎంపికతో ప్రత్యర్థులు పైచేయి సాధిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం అంతర్గత విభేదాలు మరియు అనాలోచిత నిర్ణయాలతో మూల్యం చెల్లించుకుంటోంది.28 స్థానాల్లో సున్నా ఫలితం రావడం అనేది కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఉపేక్షించలేని తీవ్రమైన హెచ్చరిక. స్థానిక స్థాయిలో అధికార సమీకరణాలు మారడం ,పార్టీ యంత్రాంగం బలహీనపడటం కాంగ్రెస్ కుగడ్డు కాలం ఇంకాపోలేదని నిరూపిస్తున్నాయి. ఈ పరాభవం నుంచి వెంటనే పాఠాలు నేర్చుకుని, సంస్థాగత లోపాలను సరిదిద్దుకోకపోతే కాంగ్రెస్ భవిష్యత్తులో మరింత భారీ వెనుకబాటును ఎదుర్కోక తప్పదు. ఎప్పుడు చూసినా ఓటు చోరీ అంటూ వ్యవస్థలపై పోరాటం చేయడం తప్ప..ప్రజల తరపున పోరాటం చేయని కాంగ్రెస్‌కు ఇదిఇబ్బందికరమే.

