మంథనిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
– యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణ ఆర్థిక ప్రగతి సాధ్యమన్న మంత్రి శ్రీధర్ బాబు
– టాస్క్ ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతిక శిక్షణ
– డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ప్రత్యేక కోర్సులు.
అర్జున్ సమాచారం, మంథని , మే 06:
యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మంథనిలో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి మంత్రి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంతో టాస్క్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కేంద్రంలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మల్టీమీడియా, ఆడియో విజువల్ రంగాల్లో శిక్షణ అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాలు పెంపొందించే విధంగా ప్రత్యేక కోర్సులు రూపొందించినట్లు పేర్కొన్నారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ సంస్థ సహకారంతో ఈ శిక్షణా కేంద్రాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. యువతకు శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం కుట్టు శిక్షణ కేంద్రాలు, గార్మెంట్స్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. గ్రామీణ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించడం ద్వారా వారిని ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రతి నిరుద్యోగ యువకుడు కష్టపడే మనస్తత్వాన్ని అలవరుచుకోవాలని సూచించారు. కష్టాలను ఎదుర్కొన్నప్పుడే విజయాలు సాధ్యమవుతాయని తెలిపారు. మంథని పట్టణానికి ఆధునిక సౌకర్యాలతో కూడిన శిక్షణా కేంద్రాలను తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సురేష్, మున్సిపల్ చైర్మన్ వి. శ్రీనివాస్, మినిమమ్ వేజెస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, టాస్క్ చైర్మన్ నితిన్ కుమార్ రెడ్డి, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ సంస్థ డైరెక్టర్ రాజీవ్ త్రీవేది, ఏఎంసీ చైర్మన్ కె. వెంకన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
