ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌లో డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆకస్మిక తనిఖీ

రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌లో డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆకస్మిక తనిఖీ

📰 Generate e-Paper Clip

కరీంనగర్,అర్జున్ సమాచారం:

విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, తగిన వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ బుధవారం కరీంనగర్ లోని రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటశాల, స్టోర్ రూమ్, పడక గదులు, మరుగుదొడ్లు, భోజన ఏర్పాట్లు, విద్యార్థులకు అందిస్తున్న మెనూ, ఆహార పదార్థాల నాణ్యత, వైద్య సేవలు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను ఆయన స్వయంగా పరిశీలించారు. వంటశాల పరిస్థితిపై సీనియర్ సివిల్ జడ్జి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు వడ్డించే ఆహారం తయారు చేసే ప్రదేశం పరిశుభ్రంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాల్సి ఉండగా, అక్కడ కనిపించిన అసౌకర్యకర పరిస్థితులపై ఆయన సిబ్బందిని ప్రశ్నించారు. విద్యార్థుల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఆహార విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. అలాగే స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. నాణ్యత లేని కూరగాయలు, ఆహార పదార్థాలను విద్యార్థులకు అందించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ,సరఫరా,నిల్వ, వంట, వడ్డింపు ప్రక్రియలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు.మరుగుదొడ్ల పరిశుభ్రతపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. విద్యార్థులు రోజువారీగా వినియోగించే మరుగుదొడ్లు, స్నానపు గదులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజన మెనూ, ఆహారం నాణ్యత, పరిమాణం, సమయపాలన, తాగునీటి సౌకర్యం, వసతి గదుల పరిస్థితి, పడకల సౌకర్యం, వైద్య సేవలు తదితర అంశాలపై కూడా ఆయన వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో  జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు న్యాయవాదులు ఏ.కిరణ్ కుమార్, పెరుక రంగయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎలుగు తన్మయి, ప్యానెల్ న్యాయవాది నజీమా సుల్తానా పాల్గొన్నారు.
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!