ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeఅంతర్జాతీయంవిజయవాడశాంతిభద్రతలతోనే అభివృద్ధి, పెట్టుబడులు పోలీసు అమరవీరుల సంస్మరణ దినంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

శాంతిభద్రతలతోనే అభివృద్ధి, పెట్టుబడులు పోలీసు అమరవీరుల సంస్మరణ దినంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

విజయవాడ, అక్టోబరు 21, అర్జున్ సమాచారం:
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాజకీయ ముసుగులో అరాచకాలు, రౌడీయిజం చేసేవారిని ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నేరస్తులకు పోలీసు యూనిఫాం చూస్తే భయం కలగాలని, అదే సమయంలో బాధితులకు పూర్తి భరోసా లభించాలని ఆయన ఆకాంక్షించారు. మంగళగిరిలోని 6వ ఏపీఎస్పీ బెటాలియన్‌లో నేడు నిర్వహించిన ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమర పోలీసులకు ఆయన ఘనంగా నివాళులర్పించారుఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “ఖాకీ అంటే బాధ్యత, పోలీసు అంటే భరోసా. ప్రమాదం జరిగినా, నేరం జరిగినా ప్రజలకు మొదటగా గుర్తొచ్చేది పోలీసులే. ప్రజలు పండుగలు ప్రశాంతంగా జరుపుకోవడానికి పోలీసులు తమ కుటుంబ సంతోషాలను త్యాగం చేస్తున్నారు” అని అన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్, వీఐపీల పర్యటనలు ప్రశాంతంగా ముగియడం వెనుక పోలీసుల నిరంతర శ్రమ అభినందనీయమని కొనియాడారు. 1959లో లడఖ్‌లో చైనా సైనికులతో పోరాడుతూ పది మంది పోలీసులు ప్రాణాలర్పించారని, వారి త్యాగాలకు గుర్తుగా ఏటా ఈ దినాన్ని జరుపుకుంటున్నామని గుర్తుచేశారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు, అభివృద్ధి, ప్రజల సంతోషం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని చంద్రబాబు విశ్లేషించారు. “భద్రత, భరోసా ఉన్న చోటకే పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి. తద్వారానే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అందుకే తాను అధికారంలో ఉన్న ప్రతిసారీ శాంతిభద్రతలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తాను” అని పునరుద్ఘాటించారు. గతంలో ఫ్యాక్షన్‌ను నియంత్రించడం, నక్సలిజాన్ని ఎదుర్కోవడం, మత ఘర్షణలను అరికట్టడంలో ఏపీ పోలీసులు చూపిన ధైర్యసాహసాలు అసాధారణమైనవని ప్రశంసించారు. ఇటీవల దేశ భద్రతకు సంబంధించిన కుట్రలను ఛేదించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల స్వరూపం కూడా మారుతోందని, పోలీసు శాఖ దర్యాప్తు పద్ధతుల్లో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సీఎం సూచించారు. “ఒకే ఒక్క ఫోన్ కాల్, ఒక లింక్‌తో కష్టపడి సంపాదించుకున్న సొమ్మును సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారు. చదువుకున్నవారు సైతం మోసపోతున్నారు. ఇలాంటి నేరాలు జరగకుండా నివారించడమే ఉత్తమ పోలీసింగ్” అని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా అనలిటిక్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి వాటిని పూర్తిస్థాయిలో వినియోగించి దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచుకోవాలని కోరారు. గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణలో ‘ఈగల్’ బృందం చేస్తున్న కృషిని అభినందించారు. మహిళలపై నేరాలకు పాల్పడాలంటేనే భయపడే వాతావరణం కల్పించాలని ఆదేశించారు.
అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తీవ్రమైన ఒత్తిడితో పనిచేసే పోలీసులు యోగా, ధ్యానం ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. అమరుల త్యాగాలకు అసలైన నివాళి అర్పించాలంటే ప్రజలకు నిరంతర భద్రత కల్పించడమే మార్గమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అమర జవాన్ స్మృతిచిహ్నం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం ‘షహీద్ పుస్తక్ టోలీ’, ‘అమరులు వారు’ పుస్తకాలను ఆవిష్కరించారు. పోలీసు శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, ఫోరెన్సిక్, విపత్తు నిర్వహణ, ఆక్టోపస్ విభాగాల ఆధునిక ఆయుధాల గురించి అడిగి తెలుసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!