ePaper
Saturday, August 22, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిసబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం డాక్యుమెంట్ రైటర్లకు ఉపాధి మార్గాలు...

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం డాక్యుమెంట్ రైటర్లకు ఉపాధి మార్గాలు చూపిస్తాం దీపం-2.0 లబ్దిదారులకు నిర్థారిత తేదీల్లో నగదు జమ ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

అమరావతి, జులై 20,అర్జున్ సమాచారం:
:- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ కొందరు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని… దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.

సేవల సులభతరానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారనే అంశం సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…‘‘ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేసేలా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం-RSKలను ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రైవేటీకరణ ఎంత మాత్రమూ కాదు. పాస్ పోర్టు సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పని చేస్తాయి. పాస్ పోర్టు సేవా కేంద్రాల పనితీరు ఏ విధంగా జరుగుతుందో… ఆ తర్వాత ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో వివరించండి. పాస్ పోర్టు సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాక పాస్ పోర్టు ప్రాసెసింగ్ అనేది చాలా సులువైంది. ఇదే తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల పనితీరు ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల విషయంలో కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యతను అధికారులు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల కలిగే లాభాలను వివరించాలి. అలాగే డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఇబ్బంది లేని విధంగా మార్గాలు చూపెడతాం. దీపం-2.0 పథక లబ్దిదారులకు ఇచ్చే సబ్సిడీని క్రమపద్దతిలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సబ్సిడీని నిర్ధారిత తేదీల్లో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి. ఈ అంశంపై పౌర సరఫరాల శాఖ-ఆర్థిక శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలి. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించి అమలు చేయాలి”అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

లిటిగెంట్ పిటిషనర్లకు కౌన్సెలింగ్

“లిటిగెంట్ పిటిషనర్లను ఏ విధంగా కట్టడి చేయాలి. ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకుండా చేసే ఫిర్యాదు దారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా 81 మంది లిటిగెంట్ పిటిషనర్లు ఉన్నట్టు గుర్తించాం. వీరు సరాసరి ఒక్కొక్కరు 246 పిటిషన్లు పెడుతున్నారు. వీరి వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపించాలి. వారు పెట్టే అర్జీల్లో ప్రజా ప్రయోజనాలు ఉంటే వాటిని పరిశీలించాలి. ప్రభుత్వాన్ని, అధికారులను బద్నాం చేసే ఉద్దేశంతో పిటిషన్లు పెట్టే వారిని గుర్తించాలి. ఫిర్యాదుల పరిష్కారంలో ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ప్రాధాన్యతల వారీగా ఆర్థిక సమస్యలను పరిష్కరిద్దాం. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం 49 శాతం లోటు వర్షపాతం ఉంది. ఈ ప్రభావం నుంచి బయటపడేసే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. ఈ మేరకు రైతుల్లో అవగాహన కల్పించాలి. డ్రై క్రాప్స్ వేసేలా రైతులను ప్రొత్సహించండి. ఇదే సమయంలో వీబీ జీ రామ్ జీ పనులను పెద్ద ఎత్తున చేపట్టాలి. జలధార పనులకు వీబీ జీ రామ్ జీ పనుల్ని అనుసంధానం చేయాలి. ప్రజాభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పని విధానం మార్చుకోవాలి. పరిపాలనా విధానాలను మెరుగుపరుచుకోవాలి. సమస్యలు ఉత్పన్నమయ్యాక చర్యలు తీసుకోవడంతోపాటు… ముందుగానే ఏయే సమస్యలు వస్తాయనే విషయాన్ని అంచనా వేసి.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!