హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణ ప్రాంతం నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ సహకారంతో ప్రారంభించిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం మరోసారి మంచి ఫలితాలను సాధించింది. ఇటీవల విడుదలైన సివిల్స్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులై 31 మంది అభ్యర్థులు తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. సింగరేణి సంస్థ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహకం అందించేందుకు రెండు నెలల క్రితం దరఖాస్తులను ఆహ్వానించింది.
వచ్చిన దరఖాస్తుల్లో 158 మంది అర్హులైన అభ్యర్థులను గుర్తించి, ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.1.58 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించింది. ఈసారి ప్రోత్సాహక మొత్తాలను నేరుగా అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేశారు. ఈ ఆర్థిక సహకారంతో అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు మరింత ఉత్సాహంతో సిద్ధమయ్యారు. వారిలో 31 మంది తుది ఇంటర్వ్యూకు ఎంపిక కావడం విశేషం. తుది ఇంటర్వ్యూకు ఎంపికైన 31 మంది అభ్యర్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ త్వరలో ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అదనపు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించనుంది.
సివిల్స్ మెయిన్స్ లో ఉత్తీర్ణులై తుది ఇంటర్వ్యూకు ఎంపికైన తెలంగాణ బిడ్డలందరికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ఇంటర్వ్యూ దశకు చేరుకున్న అభ్యర్థులందరూ తుది పరీక్షలోనూ విజయం సాధించి తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకానికి సింగరేణి సంస్థ గత రెండేళ్లుగా తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల నుంచి ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ పథకం ద్వారా మొదటి ఏడాది ఏడుగురు, రెండో ఏడాది 20 మంది చొప్పున మొత్తం 27 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించడం విశేషం.
ఈ ఏడాది కూడా అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు తుది ఇంటర్వ్యూలో విజయం సాధించి సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావాలని, ఈ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నారని, ఈ మాక్ ఇంటర్వ్యూల నిర్వహణకు కూడా సింగరేణి సంస్థ తన సహకారాన్ని అందిస్తుందని సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి తెలిపారు. ఈ ఏడాది తుది ఇంటర్వ్యూకు ఎంపికైన 31 మందిలో వరంగల్ జిల్లా నుంచి 6, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా నుంచి 4, హైదరాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి 3, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున, ఆదిలాబాద్, నారాయణపేట, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున తుది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు.
===================
సివిల్ సర్వీసెస్‌లో తుది ఇంటర్వ్యూకు అర్హత సాధించిన 31 మంది తెలంగాణ అభ్యర్దులు అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
RELATED ARTICLES

