హైదరాబాద్,అర్జున్ సమాచారం:
హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను తగ్గించడం కోసం రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మూడు ప్రధాన మార్గాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేవడానికి ఆమోదం తెలిపింది. డిసెంబర్‌లోగా పనులు ప్రారంభించి.. 2027 చివరి నాటికి పీఆర్టీఎస్ సేవలు అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో కేపీహెచ్‌బీ నుంచి బయోడైవర్సిటీ మెట్రో స్టేషన్ (ప్రతిపాదిత) వరకు ఏర్పాటు చేయబోయే మార్గం కీలకం కానుంది.
హైదరాబాద్ నగరంలోని ఐటీ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) మెట్రో స్టేషన్ నుంచి త్వరలో రానున్న బయోడైవర్సిటీ మెట్రోస్టేషన్ వరకు పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ( పీఆర్టీఎస్ ) ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా మైండ్ స్పేస్ మీదుగా బయోడైవర్సిటీ మెట్రో స్టేషన్ వరకు పీఆర్టీఎస్‌ను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నగరంలోని ఐటీ సంస్థలు ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, చందానగర్ ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తు్న్నారు. మియాపూర్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే మెట్రోలో వెళ్లాలంటే చుట్టూ తిరుగుతూ అమీర్‌పేట మీదుగా 17 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. అంతే కాకుండా అమీర్‌పేటలో రైలు మారాలి. అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో.. ఎక్కువ దూరం ప్రయాణించడం, రైలు మారాల్సి రావడం ఐటీ ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఉంది. దీంతో చాలా మంది ఇప్పటికీ కార్లు, బైకుల, ట్యాక్సీల మీదే ఆఫీసులకు వెళ్తున్నారు. దీంతో గచ్చిబౌలి నుంచి కేపీహెచ్‌బీ వెళ్లే రూట్‌లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. పీఆర్టీఎస్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో డిసెంబర్ నాటికి టెండర్లు పూర్తి చేసి.. 2027 చివరి నాటికి పీఆర్టీఎస్‌ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ కారిడార్‌లో పీఆర్టీఎస్ సాధ్యాసాధ్యాలపై లీ అసోసియేట్స్ సమర్పించిన రిపోర్టు ఇప్పటికే సిద్ధంగా ఉంది కాబట్టి వెంటనే పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్లలో మొత్తం 34.46 కిలోమీటర్ల మేర పీఆర్టీఎస్‌ను ప్రతిపాదించారు. అయితే తక్షణ ప్రాధాన్యంగా కేపీహెచ్‌బీ నుంచి రాయదుర్గం వరకు 7.62 కి.మీ. మార్గా్న్ని మొదటి జోన్‌లో భాగంగా అందుబాటులోకి తేనున్నారు. తర్వాత దీన్ని మిగతా ఐటీ కారిడార్ మొత్తానికి విస్తరించనున్నారు. ఐటీ కారిడార్‌తోపాటు హైదరాబాద్ కోర్ సిటీలోనూ మరో రెండు మార్గాల్లో పీఆర్టీఎస్ ఏర్పాటు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఎల్బీ స్టేడియం నుంచి రాణిగంజ్ బస్టాండ్ వరకు ఒక లైన్ కాగా.. అసెంబ్లీ మెట్రో నుంచి బేగంపేటకు మరో లైన్ ఉండనుంది. ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా రాణిగంజ్ బస్టాండ్ వరకు మొదటి లైన్ ఉంటుంది. రెండో లైన్లో రవీంద్ర భారతి, సచివాలయం, ఐమ్యాక్స్ ప్రాంతాలు కూడా కవర్ అవుతాయి. అయితే వీటిలో అసెంబ్లీ నుంచి బేగంపేట పీఆర్టీసీ లైన్ ఏర్పాటు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
======================
హైదరాబాద్‌లో 3 కారిడార్లలో పీఆర్‌టీఎస్.. రేవంత్ రెడ్డి ఆమోదం.. ఐటీ ఉద్యోగులకు వరంలా మారనున్న ర్యాపిడ్ ట్రాన్సిట్ సేవలు
RELATED ARTICLES

