ఓటర్లకు ఈసీ భారీ ఊరట….ఫామ్-6 దాఖలు చేస్తే కేసులు పెట్టరు,
న్యూఢిల్లీ: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 16.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో పేర్లు గల్లంతైన పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) భారీ ఊరటనిచ్చింది. గతంలో ఓటర్లుగా నమోదై ఉండి, ముసాయిదా జాబితాలో పేరు కనిపించకపోవడంతో తిరిగి నమోదు కోసం ఫామ్ 6 దాఖలు చేసినంత మాత్రాన ఎలాంటి విచారణ ఉండదని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. గతంలో ఓటర్లుగా నమోదైనవారు ఫామ్ 6 సమర్పిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 31 కింద చర్యలు తీసుకుంటారనే ఆందోళనలు వ్యక్తమయ్యాయని ఈసీ తెలిపింది.
అయితే, వారు మరే ఇతర లోక్‌సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు కాకూడదని, దరఖాస్తులోని ప్రకటన చట్టబద్ధంగా ఉండాలనే షరతు విధించింది. ఈ స్పష్టతను స్థానిక భాషల్లోనూ విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ర్టాల ఎన్నికల అధికారులను కోరింది. సర్ కు గైర్హాజరు, వలస వెళ్లిన, మరణించిన, నకిలీ ఓటర్లుగా గుర్తించిన జాబితాలోని అర్హులను తిరిగి చేర్చాలని సుప్రీంకోర్టు చేసిన సూచననూ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 6న రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఓటర్లు తమ నివాస ప్రాంతానికి సంబంధించిన ఈఆర్ వో, ఏఈఆర్ వో లేదా బీఎల్ వోకు ఎన్యుమరేషన్ ఫామ్ సమర్పించవచ్చు. గతంలో ఫామ్ ఇవ్వకపోవడానికి గల కారణాన్ని అనుబంధం-బీలో పేర్కొనాలి. స్వయంగా లేదా కుటుంబ సభ్యుల ద్వారా దీనిని అందించవచ్చు. ఈసీఐనెట్ లో ఈ-సైన్‌తో ఆన్లైన్ సమర్పణకూ అవకాశం కల్పించింది. అదే సమయంలో డూప్లికేట్ నమోదులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను కాపాడటం తమ రాజ్యాంగబద్ధ బాధ్యతని పేర్కొంది. ఎస్ఐఆర్ చట్టబద్ధమైన ప్రక్రియేనని, కమిషన్ ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారని గతంలోనే సుప్రీంకోర్టుకు తెలిపింది. ఫామ్ 6 లో ఎలాంటి మార్పులు చేయలేదని కూడా స్పష్టం చేసింది.

