పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 13: 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో కాళేశ్వరం జోన్ 48 పతకాలు సాధించడం గర్వకారణమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026, క్లస్టర్–ఏ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జట్టు సమన్వయం, పరస్పర సహకారం, క్రమశిక్షణ, నిరంతర సాధన వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. పోలీస్ విధుల్లో శారీరక దారుఢ్యంతో పాటు జట్టు భావన ఎంతో అవసరమని, క్రీడలు ఈ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
క్రీడల్లో విజయం సాధించిన ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది శాఖకు గర్వకారణమని పేర్కొన్న సీపీ, భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటుతూ శాఖకు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడలకు సమయం కేటాయించే పోలీసు సిబ్బందికి శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ పోటీల్లో కాళేశ్వరం జోన్ నుంచి 51 మంది క్రీడాకారులు పాల్గొనగా, 31 మంది మొత్తం 48 పతకాలు సాధించారు. వాటిలో 8 బంగారు, 16 వెండి, 24 కాంస్య పతకాలు ఉన్నాయి. పతక విజేతల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు చెందిన నలుగురు, ములుగు జిల్లా నుంచి ముగ్గురు, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి తొమ్మిది మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 15 మంది ఉన్నారు.
కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, జూన్ సూపరింటెండెంట్ సందీప్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, శేఖర్, రమేష్, కాసిరామ్, శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.

