ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeతెలంగాణమధ్యాహ్న భోజన నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వద్దు

మధ్యాహ్న భోజన నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వద్దు

📰 Generate e-Paper Clip

సీఐటీయూ ఆధ్వర్యంలో భీమారం ఎంఈఓ, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట నిరసన

    – మధ్యాహ్న భోజన కార్మికులకు ₹10 వేల వేతనం చెల్లించాలి: డీ. రంజిత్ కుమార్

    భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, ఆగస్టు 13

    మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు కట్టబెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో గురువారం భీమారం మండల ఎంఈఓ, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.

    ఈ సందర్భంగా దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ… గత 15-20 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ సేవలందిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు ₹10,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీపై నమ్మకంతోనే కార్మికులు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని గుర్తుచేశారు. కానీ, అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచకపోగా, భోజన నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు (NGOs) అప్పగించాలని ప్రభుత్వం భావించడం సరికాదన్నారు. ఇది సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుల కడుపు కొట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    అలాగే, పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే స్కావెంజర్లకు గత సంవత్సరం ఏప్రిల్ నెలకు సంబంధించిన వేతనంతో పాటు, ఈ ఏడాది జూన్ నుండి నేటి వరకు జీతాలు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    యూనియన్ జిల్లా కమిటీ సభ్యురాలు సరిత మాట్లాడుతూ…

    “జీతాలు పెంచుతామని చెప్పి గెలిచిన ప్రభుత్వం, ఇప్పుడు మమ్మల్ని పనుల నుంచి తొలగించడానికే స్వచ్ఛంద సంస్థలకు బాధ్యతలు ఇస్తోంది. దీనివల్ల వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడతాయి. అంతేకాకుండా విద్యార్థులకు పౌష్టికాహారం కూడా అందకుండా పోయే ప్రమాదం ఉంది” అని పేర్కొన్నారు.

    రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి మరియు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, మధ్యాహ్న భోజన నిర్వహణను యథావిధిగా పాత కార్మికులతోనే కొనసాగించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

    ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు లక్ష్మి, గురువమ్మ, విజయ, అనసూయ, సత్తక్క, పద్మ, నర్బాయ్, పుష్పలత, మాధవి, రజిత, శ్యామల, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    - Advertisment -
    App Icon

    Install AS News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!