యువత సమస్యలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి.ఏఐవైఎఫ్ తాండూర్ మండల మూడో మహాసభలను జయప్రదం చేయాలి.
అర్జున్ సమాచారం. ఆగస్టు 21. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
తాండూర్: తాండూర్ మండల కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్‌లో ఆగస్టు 22న నిర్వహించనున్న అఖిల భారత యువజన సమాఖ్య తాండూర్ మండల మూడో మహాసభలను యువత అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1959 నుంచి అఖిల భారత యువజన సమాఖ్య యువత సమస్యలపై నిరంతరం సమరశీల పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు. నేటి పరిస్థితుల్లో నిరుద్యోగ యువత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంలోని ఖాళీగా ఉన్న అన్ని శాఖల్లో రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు యువజన ప్రకటనలో పేర్కొన్న అంశాలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి అందిస్తామని ఇచ్చిన హామీని కూడా వెంటనే అమలు చేయాలని కోరారు.
యువత సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు, దశలవారీ ఉద్యమాలు నిర్వహించేందుకు మహాసభల్లో కీలక తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. యువత భవిష్యత్తు కోసం జరిగే ఈ మహాసభలకు మండలంలోని యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు.
ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా అఖిల భారత యువజన సమాఖ్య మంచిర్యాల జిల్లా కార్యదర్శి లింగం రవి హాజరుకానున్నట్లు కొండు బానేష్ తెలిపారు.

