హైదరాబాద్, ఆగస్టు 21,అర్జున్ సమాచార0: హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థుల వద్దకు శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెళ్లి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పాలిటెక్నిక్‌లను శక్తి శాఖ పరిధిలోకి తీసుకురావడంపై విద్యార్థుల్లో నెలకొన్న సందేహాలు, అపోహలు, ఆందోళనలను మంత్రి ఓపికగా విని.. ఒక్కొక్క అంశంపై స్పష్టత ఇచ్చారు. విద్యార్థుల విద్య, ఫీజులు, పరీక్షలు, డిప్లొమా గుర్తింపు, ఈసెట్, లేటరల్ ఎంట్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, స్టైఫండ్ వంటి అంశాలపై వారి ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఇప్పటికే చదువుతున్న విద్యార్థుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదని భరోసా ఇచ్చారు. అలాగే పాలిటెక్నిక్‌లలో మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక విద్య, పరిశ్రమలతో అనుసంధానం, మెరుగైన ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి – విద్యార్థుల మధ్య జరిగిన సంభాషణ ఇలా సాగింది.
పాలిటెక్నిక్ విద్యార్థులు – మంత్రి వివేక్ వెంకటస్వామి మధ్య సంభాషణ
విద్యార్థుల ప్రశ్న: పాలిటెక్నిక్‌లను ‘శక్తి’ శాఖలోకి మార్చడం వల్ల మా చదువులు, సర్టిఫికెట్లు, పరీక్షల్లో ఏమైనా మార్పులు వస్తాయా?
మంత్రి వివేక్ వెంకటస్వామి: ఎలాంటి మార్పులు ఉండవు. మీరు ప్రస్తుతం ఏ విధంగా చదువుతున్నారో అదే విధంగా కొనసాగుతుంది. ఏఐసీటీఈ గుర్తింపు, పరీక్షలు, డిప్లొమా సర్టిఫికెట్ అన్నీ కొనసాగుతాయి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
విద్యార్థుల ప్రశ్న: మా ఫీజులు పెరుగుతాయా?
మంత్రి: ఫీజు విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుతం ఉన్న ఫీజు నిర్మాణమే కొనసాగుతుంది. అంతేకాదు, విద్యార్థులకు స్టైఫండ్ అందించే అంశాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. మీపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూస్తాం.
ప్రశ్న: ఈసెట్ పరీక్ష ఉంటుందా? మేము బీటెక్‌లోకి లేటరల్ ఎంట్రీ ద్వారా వెళ్లగలమా?
మంత్రి: ఖచ్చితంగా ఈసెట్ పరీక్ష ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న విధానమే కొనసాగుతుంది. ఈసెట్ ద్వారా బీటెక్‌లో రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ పొందే అవకాశం కూడా కొనసాగుతుంది. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అవసరమైతే దీనిపై స్పష్టత ఇస్తూ ప్రత్యేక జీవో కూడా తీసుకొస్తాం.
ప్రశ్న: మేము డిప్లొమా పూర్తి చేసిన తర్వాత మా సర్టిఫికెట్‌కు విలువ తగ్గుతుందా?
మంత్రి: అసలు తగ్గదు. ప్రస్తుతం మీ డిప్లొమాకు ఉన్న గుర్తింపు, విలువ పూర్తిగా కొనసాగుతుంది. భవిష్యత్తులో ఆ విలువను మరింత పెంచాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. స్కిల్ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి మీకు మరిన్ని అవకాశాలు కల్పించాలనుకుంటున్నాం.
ప్రశ్న: పాలిటెక్నిక్‌లను ప్రైవేటీకరణ చేస్తారని మాకు భయం ఉంది. నిజంగా ప్రైవేటీకరణ జరుగుతుందా?
మంత్రి: ప్రైవేటీకరణ అనే ప్రశ్నే లేదు. పాలిటెక్నిక్‌లు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. గవర్నమెంట్ కంట్రోల్లోనే విద్య, పరీక్షలు, ఫీజులు, విద్యార్థుల ప్రయోజనాలు కొనసాగుతాయి. పరిశ్రమలను భాగస్వామ్యం చేయాలనుకుంటున్నది ఉద్యోగ అవకాశాలు, సాంకేతిక శిక్షణ, సీఎస్ఆర్ నిధులు తీసుకురావడం కోసం మాత్రమే.
ప్రశ్న: పరిశ్రమలను భాగస్వామ్యం చేస్తే భవిష్యత్తులో ప్రైవేట్ సంస్థల నియంత్రణకు వెళ్లే అవకాశం ఉండదా?
మంత్రి: ఉండదు. ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధులు, సాంకేతిక సహకారం తీసుకుని పాలిటెక్నిక్‌లను అభివృద్ధి చేస్తాం. మీ విద్యకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది.
ప్రశ్న: మా ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి ఏమవుతుంది?
మంత్రి: ప్రస్తుతం మీకు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విధానం కొనసాగుతుంది. పాలిటెక్నిక్‌లు ఒక ప్రభుత్వ శాఖ నుంచి మరో ప్రభుత్వ శాఖ పరిధిలోకి వెళ్లడం వల్ల విద్యార్థులకు ఉన్న ప్రయోజనాలు తొలగిపోవు.
ప్రశ్న: ఇప్పటికే పాలిటెక్నిక్‌లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏమవుతుంది?
మంత్రి: ఇప్పటికే అడ్మిట్ అయిన విద్యార్థుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. మీరు ఏ కోర్సులో చేరారో అదే కోర్సును పూర్తి చేస్తారు. మీ పరీక్షలు, సిలబస్, సర్టిఫికెట్లు, ఫీజులు అన్నీ కొనసాగుతాయి.
ప్రశ్న: మా సిలబస్‌లో మార్పులు చేస్తారా?
మంత్రి: ప్రస్తుతం ఉన్న కోర్సులు కొనసాగుతాయి. అయితే భవిష్యత్తులో కొత్త పరిశ్రమలు, కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా కొత్త కోర్సులు తీసుకురావచ్చు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆ కొత్త కోర్సులను ఎంచుకోవచ్చు. ఇప్పటికే ఉన్న కోర్సులను తొలగించి మీపై బలవంతంగా కొత్త కోర్సులు రుద్దే పరిస్థితి ఉండదు.
ప్రశ్న: మా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయా?
మంత్రి: తగ్గవు.. పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొన్ని రంగాల్లో ఉద్యోగాల స్వభావం మారుతోంది. అందుకే కొత్త టెక్నాలజీలపై శిక్షణ ఇచ్చి, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను మీకు అందించాలనుకుంటున్నాం. దాని వల్ల మీకు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
ప్రశ్న: పాలిటెక్నిక్‌ల అభివృద్ధికి ప్రభుత్వం ఎంత నిధులు ఖర్చు చేయబోతోంది?
మంత్రి: పాలిటెక్నిక్‌లను ఆధునీకరించేందుకు సుమారు రూ.600 నుంచి రూ.800 కోట్ల వరకు నిధులు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పరికరాలు, సౌకర్యాలు, ఆధునిక సాంకేతిక శిక్షణ అందించేలా పాలిటెక్నిక్‌లను అభివృద్ధి చేస్తాం.
ప్రశ్న: ఆ నిధులు ఎందుకు శక్తి శాఖ నుంచి రావాలి?
మంత్రి: పాలిటెక్నిక్‌ల అభివృద్ధికి నిధులు అవసరం. శక్తి శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత ఆ శాఖ ద్వారా నిధులు సమకూర్చి పాలిటెక్నిక్‌లను అభివృద్ధి చేయాలన్నది మా ఆలోచన. శాఖ మారినంత మాత్రాన మీ విద్యలో మార్పు ఉండదు. పైగా మీకు అదనపు నిధులు, మెరుగైన సౌకర్యాలు అందే అవకాశం ఉంటుంది.
ప్రశ్న: మాకు స్టైఫండ్ వస్తుందని చెబుతున్నారు. ఎంత వస్తుంది?
మంత్రి: విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా స్టైఫండ్ అందించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విద్యార్థులకు రూ.2,000 స్టైఫండ్ అందించే అంశాన్ని ప్రకటించారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా ఈ ప్రయోజనం కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
ప్రశ్న: భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం ఈ నిర్ణయాలను మార్చేస్తే మా పరిస్థితి ఏంటి?
మంత్రి: ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంగా మేము మీ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఉన్న జీవోలు కొనసాగుతాయని అధికారులు కూడా స్పష్టం చేశారు. మీకు ఉన్న హక్కులు, భద్రత ఎక్కడా దెబ్బతినకుండా చూస్తాం.
ప్రశ్న: మాటలతో కాకుండా జీవో ద్వారా హామీ ఇవ్వగలరా?
మంత్రి: తప్పకుండా. మీకు ఏ అంశంపై స్పష్టత కావాలో చెప్పండి. అవసరమైన చోట జీవోలోనే స్పష్టమైన నిబంధనలు పొందుపరుస్తాం. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిది. మీకు అనుమానం ఉంటే నన్ను నేరుగా సంప్రదించండి.
ప్రశ్న: మాకు ఇంతకుముందు ఈ విషయాలపై స్పష్టత లేకపోవడం వల్లే ఆందోళన చెందుతున్నాం.
మంత్రి: మీ ఆందోళన నాకు అర్థమవుతోంది. కొత్తగా శాఖ మారుతుందని తెలిసినప్పుడు సందేహాలు రావడం సహజం. అందుకే నేను స్వయంగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. మీ సమస్యలు ఏమైనా ఉంటే ఒక్కొక్కటిగా చెప్పండి. చర్చిద్దాం.. పరిష్కరిద్దాం.
ప్రశ్న: చివరగా పాలిటెక్నిక్ విద్యార్థులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
మంత్రి: మీ భవిష్యత్తు బాగుండాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. మీకు ఎక్కడా నష్టం జరగదు. ఫీజులు, పరీక్షలు, డిప్లొమా గుర్తింపు, లేటరల్ ఎంట్రీ, సిలబస్, ఇప్పటికే ఉన్న విద్యార్థుల ప్రయోజనాలు.. ఏ విషయంలోనూ మీకు ఇబ్బంది కలిగేలా నిర్ణయం తీసుకోం. పైగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల సహకారం, కొత్త కోర్సులు, మెరుగైన మౌలిక సదుపాయాలతో మీకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే మా లక్ష్యం.
ప్రశ్న: అంటే మా భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం లేదంటారా?
మంత్రి: అసలు భయపడాల్సిన అవసరం లేదు. మీ భవిష్యత్తుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. మీకు ఏమైనా సందేహం ఉంటే నేరుగా అడగండి. నేను మంత్రిగా మీ ప్రతి సమస్యను విని, అవసరమైన చోట పరిష్కారం చూపించేందుకు సిద్ధంగా ఉన్నాను.
ఫ్యాకల్టీ ప్రశ్న: మా స్టాఫ్ జీతాలు, సర్వీస్ కండిషన్స్‌లో మార్పులు వస్తాయా?
మంత్రి: ఎలాంటి మార్పులు ఉండవు. జీతాలు, ప్రమోషన్లు, సర్వీస్ కండిషన్స్ అన్నీ కొనసాగుతాయి. మీరు ప్రభుత్వ ఉద్యోగులుగానే ఉంటారు. భవిష్యత్తులో అభివృద్ధి పెరిగితే మరిన్ని పోస్టులు, మరిన్ని ప్రమోషన్ అవకాశాలు ఎలా కల్పించాలనే దానిపై కూడా ఆలోచిస్తాం
========================

