ఆర్టీసీ ఈవీ ఆటోల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి..ఆటో కార్మికుల నిరవధిక బందుకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు.ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి.
దుంపల రంజిత్ కుమార్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి..
అర్జున్ సమాచారం. ఆగస్టు 22. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా కేంద్రం: రాష్ట్రంలో నడుస్తున్న ఆటో కార్మికుల ఉపాధికి భంగం కలిగించే విధంగా ఆర్టీసీ యాజమాన్యానికి ఈవీ ఆటోలను ఇవ్వాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.
శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఆటో కార్మికులు, ఆటో జేఏసీ నాయకులతో సీఐటీయూ ఆధ్వర్యంలో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడంలో ఆర్టీసీ తర్వాత ఆటో రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
నిరుద్యోగులు ప్రభుత్వాలపై ఆధారపడకుండా ఉపాధి కోసం అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసి జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రజలకు రవాణా సౌకర్యం అందిస్తూ లక్షలాది మంది ఆటో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్న ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రతి సంవత్సరం ఆటో కార్మికులకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు కాలేదని విమర్శించారు. రెండేళ్లు గడుస్తున్నా హామీల అమలుపై స్పష్టత లేకపోవడం ఆటో కార్మికుల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు ఆటో డ్రైవర్ మృతి చెందినా, గాయపడినా వారి కుటుంబాలకు తగిన భరోసా కల్పించే వ్యవస్థ ప్రస్తుతం లేకపోవడం బాధాకరమన్నారు.
ఆటో, క్యాబ్, లారీ, డీసీఎం తదితర రవాణా రంగ కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై రెండు శాతం ఉపకరాన్ని వసూలు చేయడం ద్వారా సంక్షేమ బోర్డుకు భారీగా నిధులు సమకూర్చవచ్చన్నారు. కార్మికుల నుంచి సభ్యత్వ రుసుము తీసుకొని వారిని నమోదు చేయడం ద్వారా లక్షలాది మంది రవాణా రంగ కార్మికులకు భరోసా కల్పించవచ్చన్నారు. ఈ బోర్డు ఏర్పాటు వల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడదని స్పష్టం చేశారు.
యాప్ సంస్థల కమీషన్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
ఓలా, ఊబర్, రాపిడో వంటి యాప్ సంస్థలు ఆటో, క్యాబ్ డ్రైవర్ల నుంచి ఇష్టానుసారంగా కమీషన్లు వసూలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వమే ప్రత్యేక యాప్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ ఈవీ ఆటోల ప్రతిపాదనతో ఉపాధికి ముప్పు
ఆర్టీసీ యాజమాన్యానికి ఈవీ ఆటోలను ఇవ్వాలనే నిర్ణయం ఆటో డ్రైవర్ల పొట్టకొట్టడమే అవుతుందని దుంపల రంజిత్ కుమార్ అన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో వేలాది మంది ఆటో కార్మికుల ఆదాయం తగ్గిపోయిందన్నారు.
ఆర్టీసీకి ఈవీ ఆటోలు అవసరమైతే ప్రస్తుతం ఆటో కార్మికుల వద్ద ఉన్న ఈవీ ఆటోలను ప్రజారవాణా అవసరాలకు వినియోగించుకోవచ్చని సూచించారు. కొత్తగా ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టడం వల్ల వేలాది మంది ఆటో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అందువల్ల ఈ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక బందు
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు చేపట్టనున్న నిరవధిక బందుకు సీఐటీయూ మంచిర్యాల జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
ఈ బందును కార్మికులు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, యువత, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగులు సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

