జగిత్యాల తాసిల్ చౌరస్తాలోని ప్రభుత్వ భూమిలో అంబేద్కర్ మెమోరియల్, ఆడిటోరియం నిర్మించాలి.
జగిత్యాల ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 31::
ఎంపీ ధర్మపురి అరవింద్ గారి సూచన మేరకు ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం
ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ ప్రయోజనాలకు కేటాయిస్తే బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం: జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్
జగిత్యాల జిల్లా భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని, జగిత్యాల పట్టణ అభివృద్ధిపై దూరదృష్టితో ఆలోచిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి సూచన మేరకు, జగిత్యాల పట్టణంలోని తాసిల్ చౌరస్తాలో ఉన్న పాత తహసిల్దార్ కార్యాలయ భవనం, దానికి సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ మరియు అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణానికి కేటాయించాలని కోరుతూ జగిత్యాల జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించినట్లు బీజేపీ ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ తెలిపారు.
ఈ సందర్భంగా నారపాక అశోక్ మాట్లాడుతూ… జగిత్యాల జిల్లా కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పట్టణంలోని ప్రభుత్వ భూములను భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. తాసిల్ చౌరస్తా పట్టణంలోని అత్యంత కీలకమైన ప్రాంతమని, అక్కడ ఇప్పటికే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా ఉందని తెలిపారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్గానికో, ఒక కులానికో పరిమితమైన నాయకుడు కాదని, భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ప్రజలందరికీ సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య హక్కులకు బలమైన పునాది వేసిన మహనీయుడని నారపాక అశోక్ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంతో, ఆలోచనలతో ముడిపడిన పంచతీర్థాలను అభివృద్ధి చేసి ఆధునీకరించడం ద్వారా, అంబేద్కర్ గారి వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు చేరువ చేసే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిందని నారపాక అశోక్ అన్నారు.
అంబేద్కర్ గారి జన్మస్థలం, విద్యాభ్యాసం, దీక్షాభూమి, మహాపరినిర్వాణ స్థలం తదితర చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేసి, ఆయన జీవితం మరియు రాజ్యాంగ సేవలను దేశ ప్రజలకు పరిచయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
అదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా అంబేద్కర్ గారి స్మృతిని శాశ్వతంగా నిలిపే విధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక ఆధునిక అంబేద్కర్ మెమోరియల్, ఆడిటోరియం నిర్మించాల్సిన అవసరం ఉందని అశోక్ పేర్కొన్నారు.
జగిత్యాలకు అంబేద్కర్ మెమోరియల్ ప్రత్యేక గుర్తింపుగా నిలవాలి
తాసిల్ చౌరస్తాలోని పాత తహసిల్దార్ కార్యాలయ సముదాయం, ప్రభుత్వ స్థలాన్ని అంబేద్కర్ మెమోరియల్ కోసం కేటాయించి, అదే ప్రాంగణంలో ఆధునిక సౌకర్యాలతో అంబేద్కర్ ఆడిటోరియం నిర్మించాలని కోరారు.
ఈ మెమోరియల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం, ఆయన సామాజిక ఉద్యమాలు, రాజ్యాంగ రచనలతో చేసిన సేవలు, ప్రజాస్వామ్యం, సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆడిటోరియంలో రాజ్యాంగ సదస్సులు, విద్యార్థులు–యువతకు అవగాహన కార్యక్రమాలు, సెమినార్లు, సాంస్కృతిక మరియు విద్యా కార్యక్రమాలు నిర్వహించేలా అభివృద్ధి చేస్తే జగిత్యాల జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుందని అశోక్ అన్నారు.
తాసిల్ చౌరస్తాలోని ప్రభుత్వ భూమి విలువైన ప్రజా ఆస్తి అని, దానిని ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు లేదా ఇతర వ్యక్తిగత ప్రయోజనాలకు కేటాయించకుండా ప్రజా ప్రయోజనానికి శాశ్వతంగా వినియోగించాలని నారపాక అశోక్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూమిని ఇతర ప్రయోజనాలకు కేటాయించే ప్రతిపాదనలు ఏవైనా ఉంటే ప్రభుత్వం వెంటనే పునఃపరిశీలించాలని కోరారు.
తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాల జిల్లా ప్రజల ఆకాంక్షలను గౌరవించి, తాసిల్ చౌరస్తాలోని పాత తహసిల్దార్ కార్యాలయ సముదాయాన్ని, ప్రభుత్వ స్థలాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ మరియు అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణానికి కేటాయించేందుకు వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“ఈ ప్రభుత్వం జగిత్యాల ప్రజల భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఈ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు లేదా ప్రైవేట్ సంస్థల ప్రయోజనాలకు కేటాయించకుండా, అంబేద్కర్ మెమోరియల్ మరియు ఆడిటోరియం నిర్మాణానికి కేటాయించాలి.” అని అశోక్ అన్నారు.
ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా, చట్టబద్ధమైన మార్గాల్లో జగిత్యాల జిల్లా ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి బీజేపీ ఎంపీ అరవింద్ అన్న ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో, జగిత్యాల పట్టణ అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రభుత్వ స్థలాన్ని అంబేద్కర్ మెమోరియల్ మరియు ఆడిటోరియం నిర్మాణానికి వినియోగించేలా చర్యలు తీసుకుంటామని నారపాక అశోక్ అన్నారు.
ప్రభుత్వ భూమిలో అనధికారికంగా కట్టడాలు లేదా ఆక్రమణలు ఉంటే చట్టపరమైన ప్రక్రియను అనుసరించి వాటిని తొలగించి, ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనానికి వినియోగించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
“అంబేద్కర్ గారి పేరు మీద జగిత్యాలలో ఒక గొప్ప మెమోరియల్ నిర్మించడం మా రాజకీయ ప్రయోజనం కోసం కాదు. ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమానత్వం, సామాజిక న్యాయానికి జగిత్యాల జిల్లా తరఫున ఇచ్చే గౌరవం. ఈ లక్ష్యాన్ని సాధించే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది.” అని నారపాక అశోక్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సట్టా రవిరాజ్, బన్న సంజీవ్, దుబ్బ శ్రవణ్ కుమార్, కొత్తూరు అంజి, బొల్లం అజయ్ కుమార్, సుంకే అశోక్, ఎర్ర రాజు , గునుకొండ నరేష్, బండ వంశీ, తిమ్మని సురేష్, నల్ల శంకర్, పసుల రాకేష్, సుద్దాల విజయ్, నక్క బాపురెడ్డి, ఉయ్యాల స్వామి, బెత్తపు నరసయ్య, మోకనపల్లి నగేష్ తదితర ఎస్సీ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

