పాత పెన్షన్ కోసం సెప్టెంబర్ 1న ఉద్యోగుల నిరసన-పెన్షన్ విద్రోహ దినాన్ని విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ పిలుపు..
అర్జున్ సమాచారం. ఆగస్టు 31. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల, ఆగస్టు 31: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న నిర్వహించనున్న పెన్షన్ విద్రోహ దినాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి మంచిర్యాల జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, కార్యదర్శి జనరల్ వనజారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల టీఎన్జీవో భవన్లో ముందస్తు సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలవుతున్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానం వల్ల ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ వేతన సవరణ సంఘం, ఉద్యోగుల ఆరోగ్య పథకం, కరువు భత్యం, రూ.12 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.సెప్టెంబర్ 1న నిర్వహించే నిరసన కార్యక్రమంలో అటెండర్ నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.జిల్లా కార్యదర్శి జనరల్ వనజారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అన్ని ఉద్యోగ సంఘాలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1న జరిగే పెన్షన్ విద్రోహ దినం నిరసనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొనాలని కోరారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు నిరసన
మంచిర్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం, నస్పూర్‌లోని ఉప కలెక్టర్ కార్యాలయం, జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సెప్టెంబర్ 1న మధ్యాహ్నం ఒంటి గంటకు పెన్షన్ విద్రోహ దినం నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కమిటీ సూచించింది.
సన్నాహక సమావేశంలో జిల్లా సహ అధ్యక్షులు శ్రీనివాసరావు దేశ్‌పాండే, బట్టారి వెంకటేశ్వర్లు, సుమిత్, పుప్పాల హనుమంతరావు, శ్రీపతి బాపురావు, పొన్న మల్లయ్య, దుర్గాప్రసాద్, భూముల రామ్మోహన్, పత్తి సత్తయ్య, ఉపాధ్యక్షులు బొడ్డు శ్రావణ్‌కుమార్, సుధాకర్, ఉపాధ్యక్షులు సూరినేని గంగాధర్, ఒడిగ కృష్ణ, బి. రవీందర్, ఎస్. కిషన్, ఏ. సునీత, నాగుల గోపాల్, మోసిన్, కోశాధికారి సతీష్‌కుమార్, ప్రచార కార్యదర్శి రాంకుమార్, కార్యదర్శులు ఎన్. సత్యనారాయణ, తిరుపతి, వెంకటేష్, టీఎన్జీవో నాయకులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

