హైదరాబాద్,అర్జున్ సమాచారం:
రాష్ట్రంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఛార్జ్ షీట్ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సురభి వాణీదేవి, ఎల్ రమణ, మాజీ ఎంపీలు మాలోత్ కవిత, కేఆర్ సురేష్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైంది. డిసెంబర్ 7న పీడ దినాలు మొదలయ్యాయి. ప్రజా పాలన అని చెప్పి తొండి మాటలు, మొండి చేతులు. రాష్ట్రంలో శిఖండి పాలన నడుస్తోందని అన్నారు. వంద రోజుల గ్యారంటీలకు మంగళం పాడారు. వెయ్యి రోజులు ప్రజలను నిలువెత్తున ముంచారు. వెయ్యి రోజుల పాలన కాదు.. వెయ్యి రోజుల ప్రజా పీడన. తెలంగాణకు పట్టిన శనికి నేటితో వెయ్యి దినాలు. అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం ఇది. వంద రోజుల్లోనే స్వర్గం చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపారు. రేవంత్ భాషలో.. ఈ వెయ్యి రోజులు ఒక క్రిమినల్ వేస్ట్. కాంగ్రెస్ పాలన అబద్ధం, అరాచకం, అజ్ఞానం, అవినీతి. నాలుగు పడగలతో బుస కొడుతున్న అనుముల నాగుపాము పాలన అని ఆరోపించారు.
రైతన్నలను రాచి రంపాన పెడుతున్న రాక్షస పాలన. నిరుద్యోగులను నిండా ముంచిన నికృష్ణ పాలన ఇది. మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలన్నారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అన్నారు. నిన్న సెక్రటేరియట్ వేల మంది ఉద్యోగులు బయటికొచ్చి ఆందోళన చేశారు. ఇస్తవా.. చస్తవా.. అని సీఎంను బెదిరించే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ విఫల పాలనకు ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది? ఉద్యోగులకు ఉత్త
చేతులు చూపారు.. దళితులను దగా చేశారు. బహుజనులను మోసం చేసిన బడుద్ధాయిల పాలన ఇది. మైనారిటీలకు ధోకా మాత్రమే మిగిలింది. బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూలుస్తున్నారు. అనుముల అనుయాయులు, పొంగులేటి అనుచరులు రాష్ట్రంలో భూములు కొల్లగొడుతున్నారు. 22-ఏ పేరిట కోట్లాది ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారు. ఆనాడు రేవంత్ గురువు తెలంగాణను నిషేధించాడు. ఈయనేమో తెలంగాణ కోటి ఎకరాల మాగాణను నిషేధించాడు. ఒక్కో ఎకరానికి 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. కమీషన్లు, పర్సంటేజీల అవినీతి అరాచక పాలన ఇది. వెయ్యి రోజుల పాలన సందర్బంగా ఏమైనా చెప్పుకుంటారేమో అని చూశామని అన్నారు.
కానీ ఢిల్లీ ముందు మోకరిల్లిన సిల్లీ పాలన ఇది. తమ స్వతంత్రాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టిన సామంతుల పాలన.ఢిల్లీ ముందు మోకరిల్లిన సన్నాసుల పాలన. జలద్రోహం చేస్తున్న జలగల పాలన. ఆనాడు రేవంత్ రైతులకు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్నడు. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక రైతులకు పంగనామం పెట్టారు. వ్యవసాయ కూలీలకు, విద్యార్థులకు, యువజనులకు పంగనామమే. మహిళలను కూడా మోసం చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో ప్రతీ రంగంలో పతనమే. సమాజంలోని ప్రతీ వర్గం ఆగ్రహంతో వుందని అన్నారు.
నీరు పారాల్సిన చోట నెత్తురు పారించే వాడు నేరగాడా? ముఖ్యమంత్రా? ఒక్క యూరియా బస్తా కోసం నరకం అనుభవిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో నెలలపాటు పడిగాపులు కాస్తున్నారు. దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి మమ్మల్ని నర్సంపేట తీసుకెళ్లారు. మక్క రైతుల కష్టాలను దగ్గరుండి చూపెట్టారు. రైతులు తమ బాధ చెప్తుంటే చలించిపోయినమని అన్నారు.
అన్నదాత జేబులు కొట్టి.. రాహుల్ గాంధీ జేబులు నింపుతున్నడు. తన తల తెగిపడినా మోటర్లకు మీటర్లు పెట్టనివ్వనని కేసీఆర్ తేల్చిచెప్పారు. రూ.30 వేల కోట్లు ఇవ్వకున్నా మీటర్లు మాత్రం పెట్టనివ్వలేదు. ఇప్పుడు మోటర్లకు మీటర్లు పెట్టడానికే రైతు డిస్కం పేరిట కుట్ర రైతును శాశ్వతంగా చిదిమేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
=======================

