హైదరాబాద్, సెప్టెంబరు 24:
అర్జున్ సమాచారం:
భక్తిశ్రద్ధలతో పూజలనంతరం గణనాథుడి నిమజ్జన కార్యక్రమానికి నగర ప్రజలు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే కొన్ని విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేయగా.. శుక్రవారం ప్రధాన నిమజ్జన ఘట్టం ప్రారంభం కానుంది. భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా ఏర్పాట్లు చేసింది. కూకట్ పల్లి ఐడీఎల్ చెరువు అభివృద్ధి పనులు పూర్తవ్వనప్పటికీ.. గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఏకంగా 25 అడుగుల మేర చెరువును తవ్వి నిమజ్జనాలు సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేసింది హైడ్రా. ఈ ఏర్పాట్లు ఇలా ఉండగా.. హుస్సేన్‌సాగర్‌తో పాటు నిమజ్జనం పెద్ద సంఖ్యలో జరిగే చెరువులలో హైడ్రా స్విమ్మర్లను రంగంలోకి దించింది. హుస్సేన్‌సాగర్లో మూడు షిఫ్టులలో చెరి 50 మంది చొప్పున మొత్తం 150 మంది స్విమ్మర్లను అందుబాటులోకి తెచ్చింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరో 84 మంది స్విమ్మర్లను విధుల్లో ఉంచింది. వీరికి అదనంగా 51 డీఆర్ ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా మిగతా శాఖలతో కలిసి హైడ్రా చర్యలు తీసుకుంటోందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
======================

