తోటమాలి కార్మికులను ఇతర పనులకు వినియోగించొద్దు.టెండర్ లేని పనులకు వాడుకునే విధానాన్ని నిలిపివేయాలి: ఐఎఫ్టీయూ.
పెద్దపల్లి:అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 25. రామగిరి డెస్క్.
ఆర్జీ-2 డివిజన్లో తోటమాలి కాంట్రాక్ట్ కార్మికులను టెండర్ పరిధిలో లేని ఇతర పనులకు వినియోగించే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆర్జీ-2 జీఎం తాళ్లపల్లి లక్ష్మీపతిగౌడ్కు యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.అశోక్ మాట్లాడుతూ.. ఆర్జీ-2లో తోటమాలి పనులకు సంబంధించిన టెండర్ పిలవకుండానే మాస్టర్ బేస్‌లో కార్మికులను పనిలోకి తీసుకున్నారని ఆరోపించారు. తోటమాలి కార్మికులను పార్కులు, గార్డెన్ల నిర్వహణకు మాత్రమే వినియోగించాల్సి ఉండగా, ఇతర ప్రాంతాల్లో చెట్లు నాటించడం, నర్సరీలో చెట్లు మోయించడం, కలుపు మొక్కలు తొలగించడం, పాత తొమ్మిదో ఇంక్లైన్ మ్యాగజైన్ వద్ద చెట్లు నాటించడం, 7 ఎల్పీ వద్దకు కార్మికులను పంపించడం వంటి పనులకు వినియోగిస్తున్నారని తెలిపారు.
టెండర్లో ఏ పని కోసం కార్మికులను తీసుకున్నారో ఆ పనికే వారిని పరిమితం చేయాలని కోరారు. ప్రస్తుతం తోటమాలి కార్మికులు చేస్తున్న ఇతర పనులకు సంబంధించి టెండర్లు పిలిచారా? పిలిస్తే ఆ పనులకు సంబంధించిన కార్మికులు ఎక్కడ ఉన్నారు? వారు ఏ పనులు చేస్తున్నారు? అనే విషయాలపై అధికారులు పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు.
పార్కులు, గార్డెన్ల నిర్వహణ సక్రమంగా జరుగుతుందా లేదా అనే విషయాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, తోటమాలి కార్మికులను ఇతర పనులకు పంపకుండా పార్కుల నిర్వహణకే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తోటమాలి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఐఎఫ్టీయూ నాయకులు హెచ్చరించారు.
వినతిపత్రం అందజేసిన వారిలో ఐఎఫ్టీయూ నాయకులు డి.బుచ్చమ్మ, ఎం.రమా, ఎం.దుర్గయ్య, సీహెచ్.శంకర్, ఎం.మల్లికార్జున్, పి.సుగుణ, వినోద, ఎం.లక్ష్మి, రాజేశ్వరి, కవిత, మంజుల, ఐలయ్య, సరూప, లింగయ్య, ఆర్.లక్ష్మి, భవాని, కే.లావణ్య, ఎన్.లక్ష్మి, కోమల తదితరులు పాల్గొన్నారు.

