చెన్నూర్ బస్ డిపో నిర్మాణ పనుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి:కోటపల్లి మండల సోషల్ మీడియా వింగ్ అధ్యక్షులు ఆసంపెల్లి సంపత్ కుమార్.
కోటపల్లి, చెన్నూర్ నియోజక వర్గం, అర్జున్ సమాచారం, అక్టోబర్ 10 :
చెన్నూర్ నియోజకవర్గంలో బస్ డిపో నిర్మాణ పనులు నిలిచిపోవడం పట్ల కోటపల్లి మండల సోషల్ మీడియా అధ్యక్షులు ఆసంపెల్లి సంపత్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువై ఇన్ని నెలలు గడుస్తున్నా, స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి వర్యులు బస్ డిపో నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడం శోచనీయమని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
చెన్నూర్ ప్రజల దశాబ్దాల కల అయిన బస్ డిపో ఏర్పాటు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో, ఉద్యమ నాయకుడు, చెన్నూర్ అభివృద్ధి ప్రదాత డాక్టర్ బాల్క సుమన్ ప్రత్యేక శ్రద్ధ వహించారని సంపత్ కుమార్ గుర్తు చేశారు. మూడు రాష్ట్రాల సరిహద్దులకు కేంద్ర బిందువుగా ఉన్న చెన్నూర్ భవిష్యత్తు అవసరాలను గుర్తించి, దూరదృష్టితో 4 ఎకరాల స్థలంలో రూ. 4 కోట్ల నిధులతో బస్ డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేసి, కాంపౌండ్ వాల్ పనులను పూర్తి చేయించారని తెలిపారు.
ప్రస్తుత మంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యేకు చెన్నూర్ ప్రజల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిలిచిపోయిన బస్ డిపో నిర్మాణ పనులను వెంటనే పునఃప్రారంభించి త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, చెన్నూర్ నియోజకవర్గ యువతకు ఇచ్చిన హామీ మేరకు 45,000 ఉద్యోగాలను వెంటనే కల్పించాలని కోరారు.
ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం డాక్టర్ బాల్క సుమన్ స్ఫూర్తితో ప్రజా పక్షాన నిలబడి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రశ్నిస్తూనే ఉంటామని ఆసంపెల్లి సంపత్ కుమార్ స్పష్టం చేశారు. డిపో పనులు పూర్తి అయ్యేంత వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

