ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeతెలంగాణటీ.జీ.పీ.ఎస్.సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి.

టీ.జీ.పీ.ఎస్.సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి.

📰 Generate e-Paper Clip

టీ.జీ.పీ.ఎస్.సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి.

నిజామాబాద్, అక్టోబర్ 19. అర్జున్ సమాచారం ప్రతినిధి.
 

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24, 26వ తేదీలలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీ.బీ.టీ) విధానంలో జరుగనున్న పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్టు (అనలిస్ట్), అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ ద్వారా ఈ నెల 24, 26 తేదీలలో పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమీక్ష జరిపారు. పరీక్షల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకుని, పలు సూచనలు చేశారు.
      ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో గల ఏ.వీ ఎంటర్ ప్రైజెస్ సెంటర్ లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. 24న అసిస్టెంట్ సైంటిస్టు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాన్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయని అన్నారు. 26వ తేదీన కూడా అవే సమయాలలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్ లలో పరీక్షలు జరుగుతాయని వివరించారు.
     జిల్లాలో 24వ తేదీ నాటి పరీక్షకు 90 మంది అభ్యర్థులు, 26వ తేదీ నాటి పరీక్షకు 190 మంది హాజరు కానున్నారని తెలిపారు. కాపీయింగ్, లీకేజీలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ లను నియమించామని, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు అనుక్షణం నిశిత పర్యవేక్షణ జరుపుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
         బయో మెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రల సేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉదయం పరీక్షకు సంబంధించి ఉదయం 8.00 గంటల నుండే పరీక్షా కేంద్రం లోనికి వెళ్లేందుకు అనుమతించడం జరుగుతుందని, 9.30 గంటలకు గేట్లు మూసివేస్తారని, నిమిషం ఆలస్యం అయినా అనుమతించబడరని తెలిపారు. మధ్యాహ్నం సెకండ్ సెషన్ పరీక్షకు సంబంధించి 12.30 గంటల నుండి లోనికి అనుమతించడం జరుగుతుందని, 2.00 గంటలకు గేట్లు మూసివేస్తారని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రం లోనికి మొబైల్ ఫోన్, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వంటివి తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని, ఈ మేరకు ప్రతి కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశించామన్నారు. పరీక్షా సమయం ప్రారంభం నుండి ముగిసేంత వరకు పరీక్ష కేంద్రం నుండి అభ్యర్థులతో పాటు ఇన్విజిలేటర్లు కూడా బయటకు వెళ్లకూడదని తెలిపారు.
      కాగా, పరీక్షా కేంద్రంలో పరీక్షల నిర్వహణ విధుల్లో పాల్గొంటున్న అధికారులు, సిబ్బందికి సంబంధించిన బంధువులు ఎవరూ పరీక్ష రాయడం లేదని వారి నుండి ధృవీకరణ పత్రం తీసుకోవాలని కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. ఏ చిన్నపాటి అవాంతరం, గందరగోళానికి తావు లేకుండా సాఫీగా పరీక్షలు జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్ష కొనసాగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్కో ఎస్.ఈ ని ఆదేశించారు. సమయానుకూలంగా రవాణా వసతి అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అదేవిధంగా పరీక్షా కేంద్రంలో వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని, తాగునీరు, టాయిలెట్లు తదితర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 24మంది అభ్యర్థులకు ఒకరు చొప్పున ఇన్విజిలేటర్లను నియమించాలని, చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరు కూడా పరీక్షా కేంద్రం లోనికి సెల్ ఫోన్ తీసుకువెళ్లకూడదని స్పష్టం చేశారు. అధికారులు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా పక్కాగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ట్రైనీ కలెక్టర్ సురేష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!