ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeఅంతర్జాతీయంవిజయవాడఅక్టోబర్ 27-30 మధ్య తీవ్ర తుఫాను హెచ్చరిక

అక్టోబర్ 27-30 మధ్య తీవ్ర తుఫాను హెచ్చరిక

📰 Generate e-Paper Clip

విజయవాడ అక్టోబరు 22,అర్జున్ సమాచారం:
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో అక్టోబర్ 23న (శుక్రవారం) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.థాయ్‌లాండ్ గల్ఫ్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనానికి అనుబంధంగా ఈ వ్యవస్థ బలపడుతోంది. ఇది ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలి, ఆ తర్వాత పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించనుంది. దీని గమనం, తీవ్రతను బట్టి రెండు రాష్ట్రాలపై వాతావరణ ప్రభావం ఆధారపడి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వర్ష హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌పై ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అమరావతి కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు తదుపరి సూచనలు అందే వరకు వేటకు వెళ్లవద్దని సూచించింది.
తెలంగాణలో తేలికపాటి జల్లులు
ఇక తెలంగాణలోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అల్పపీడనం బలపడే కొద్దీ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాల సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడటం వంటివి చేయరాదని, ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు కోత కోసిన పంటలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎప్పటికప్పుడు స్థానిక వాతావరణ సమాచారాన్ని అనుసరించాలని అధికారులు కోరుతున్నారు.
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ అల్పపీడన పరిణామాలు రానున్న రోజుల్లో బలపడి తీవ్రమైన తుఫానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.  అక్టోబర్ 27 నుంచి 30వ తేదీల మధ్య ఈ తుఫాను తీవ్ర రూపం దాల్చి కోస్తాంధ్ర ,  ఒడిశా తీరాల వైపు దూసుకొచ్చే సూచనలు స్పష్టమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు ఒడిశా దక్షిణ తీరప్రాంతాలు ఈ తుఫాను తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉండటంతో తీరప్రాంత యంత్రాంగాన్ని ముందస్తుగా అప్రమత్తం చేశారుఈ ముప్పు దృష్ట్యా అక్టోబర్ 27 నుంచి 30 మధ్య కోస్తాంధ్ర ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో, పీక్ సమయంలో అంతకంటే ఎక్కువ వేగంతో ఈదురు గాలులు వీచే వీలుంది. తీరప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్స్ సమాయత్తమవుతున్నాయి. వేటకు వెళ్లిన మత్స్యకారులను వెంటనే తీరానికి తిరిగి రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారుఈ తుఫాను ప్రభావం పొరుగున ఉన్న తెలంగాణపై ఎంతవరకు ఉంటుంది?  అనే దానిపై వాతావరణ శాఖ స్పష్టతనిచ్చింది. తెలంగాణకు నేరుగా తుఫాను ముప్పు లేనప్పటికీ, తీరప్రాంతానికి సమీపంలో ఉండే ఉమ్మడి ఖమ్మం  , నల్గొండ, సూర్యాపేట ,  మహబూబాబాద్ జిల్లాల్లో దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అక్టోబర్ 27 రాత్రి నుంచి 30వ తేదీల మధ్య తెలంగాణలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో మోస్తరు నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.  అయితే హైదరాబాద్ సహా పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తుఫాను ప్రభావం సాపేక్షంగా తక్కువగానే ఉండనుంది. అక్కడ వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే వీలుంది. కానీ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో హఠాత్తుగా వీచే ఈదురుగాలులు,  ఉరుములతో కూడిన వర్షాల వల్ల చేతికొచ్చిన ఖరీఫ్  పంటలకు కొంతమేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఆయా జిల్లాల రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.అక్టోబర్ చివరి వారంలో రానున్న ఈ తుఫాను తీవ్రత ప్రధానంగా కోస్తాంధ్ర-ఒడిశా తీరాలపైనే కేంద్రీకృతమై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యంత్రాంగాన్ని హై అలర్ట్‌లో ఉంచగా, తెలంగాణ సైతం సరిహద్దు జిల్లాల్లో వాతావరణ మార్పులను నిశితంగా పరిశీలిస్తోంది. రాబోయే 48 గంటల్లో ఈ తుఫాను   కచ్చితమైన గమనం ,  దాటే తీరంపై IMD పూర్తి స్థాయి బులెటిన్లను విడుదల చేయనుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!