ట్రంప్ ను దెబ్బతీసిన యాంటీఇండియా,
విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబరు 7.
అమెరికాలో జరిగిన మిడ్ టెర్మ్ ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీని అమెరికన్లు ఆదరించారు. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే ఇందుకు కారణం. ఇక, అక్కడ ఉన్న భారత సంతతి ఓటర్లు సైతం డెమొక్రాట్లకు మద్దతు ఇచ్చినట్టు వెల్లడయ్యింది. ఎన్నికలకు ముందు నిర్వహించిన పలు సర్వేల్లో 60 శాతానికిపైగా ఇండియన్ అమెరికన్లు ఆ పార్టీకి ఓటేస్తామని చెప్పారు. అమెరికాలో భారతీయుల పట్ల పెరుగుతోన్న జాత్యహంకార ద్వేషం, హెచ్-1 బీ వీసా నిబంధనలు వంటివి ప్రభావితం చేశాయి.అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేల్లో భారతీయ-అమెరికన్లు డెమొక్రాటిక్ పార్టీ వైపే మొగ్గు చూపారు. వలస విధానాలు, జాతి వివక్ష, ట్రంప్ పరిపాలన యంత్రాంగం అనుసరించిన వైఖరే ఇందుకు ప్రధాన కారణం. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, యుగోవ్ భాగస్వామ్యంతో అక్టోబర్ 7 నుంచి 27 మధ్య 1,000 మంది భారతీయ-అమెరికన్లపై నిర్వహించిన సర్వేలో 62 శాతం మంది డెమొక్రాట్లకు ఓటు వేయనున్నట్లు చెప్పగా, కేవలం 19 శాతం మంది మాత్రమే రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చారు. మరో 12 శాతం మంది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అలాగే, 46 శాతం మంది తమను డెమొక్రాట్లుగా, 19 శాతం మంది రిపబ్లికన్లుగా, 26 శాతం మంది స్వతంత్రులుగా చెప్పుకున్నారు.డెమొక్రాట్లకు ఓటేయాలనుకున్న వారిలో 35 శాతం మంది ఆ పార్టీపై ఉన్న అభిమానం కంటే రిపబ్లికన్లపై ఉన్న వ్యతిరేకతతోనే ఓటేస్తున్నామని చెప్పారు. మిగిలిన 65 శాతం మంది డెమొక్రాటిక్ అభ్యర్థులకు మద్దతుగా ఓటేస్తామని పేర్కొన్నారు.గతంతో పోలిస్తే భారతీయ-అమెరికన్ పురుషుల్లో రిపబ్లికన్ పార్టీకి ఉన్న మద్దతు వేగంగా పడిపోయింది. 40 ఏళ్లు పైబడినవారిలో జనవరికి 32 శాతంగా ఉన్న రిపబ్లికన్ మద్దతుదారులు, సర్వే సమయానికి 16 శాతానికి పడిపోయారు 18 నుంచి 39 ఏళ్ల యువతలో 2024 ఎన్నికలప్పుడు డొనాల్డ్ ట్రంప్‌నకు 40 శాతం మద్దతు దక్కగా, ఇప్పుడు కేవలం 23 శాతం మంది మాత్రమే రిపబ్లికన్లను సమర్థించారు.భారతీయ అమెరికన్ల మూడ్ మారడానికి ఇమ్మిగ్రేషన్ విధానాలే ప్రధాన కారణం. హెచ్-1బీ వీసా ఆంక్షలు, డిపోర్టేషన్లు, భారతీయ ఐటీ కంపెనీలపై తనిఖీల పట్ల భారతీయ-అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా నివసించే వృత్తి నిపుణులను, అక్రమ వలసదారులను ట్రంప్ ఒకే గాటన కట్టడం ఐటీ రంగంలో పనిచేసే వారిని తీవ్రంగా ప్రభావితం చేసింది.సర్వేలో పాల్గొన్న వారిలో 48 శాతం మంది భారతీయులను లేదా భారతీయ-అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని చేసిన జాతి వివక్ష పూరిత సోషల్ మీడియా పోస్టులను చూశామని చెప్పారు. 25 శాతం మంది తాము నేరుగా జాత్యహంకార వివక్షకు గురయ్యామని తెలిపారు.సెప్టెంబర్ 2026లో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ‘ట్రాన్స్ఫార్మర్స్’ క్యారెక్టర్ ఒక సిక్కు డ్రైవర్‌ను నిలదీస్తున్నట్లు ఉన్న ఫోటోను షేర్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు, నిరసనలు వెల్లువెత్తడంతో తొలగించింది.అక్టోబర్‌లో చికాగో సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంపై దాడికి కుట్ర పన్నిన 19 ఏళ్ల యువకుడిని అధికారులు అరెస్టు చేశారు. చాలా మంది భారతీయ నిపుణులు తాత్కాలిక హెచ్-1బీ వీసాపై ఉంటూనే అమెరికాలో శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. డెమొక్రాట్ల నేతృత్వంలోని కాంగ్రెస్ గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌ను తగ్గించేందుకు ట్రంప్ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ప్రతి దేశానికి గరిష్టంగా 7% మాత్రమే కోటా పరిమితి, భారత్ నుంచి EB-2, EB-3 కేటగిరీలలో దరఖాస్తుదారులు ఎక్కువగా ఉండటంతో ఈ జాప్యం జరుగుతోంది.ఈ బ్యాక్‌లాగ్‌ను తగ్గించాలంటే వార్షిక గ్రీన్ కార్డ్ పరిమితులను పెంచడం, దేశం ప్రాతిపదికన కోటా పరిమితి తొలగించడం లేదా సవరించడం వంటి చట్టసవరణలు అవసరం. ట్రంప్ విధానాలను డెమొక్రాట్లు ప్రశ్నించినప్పటికీ, సడలింపులతో కూడిన సంస్కరణలు తక్షణమే వస్తాయని ఖచ్చితంగా చెప్పలేం.హెచ్-1బి, గ్రీన్ కార్డ్ విధానాలను కాంగ్రెషనల్ కమిటీలు నిర్ణయిస్తాయి. హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ చట్టాలకు హౌస్ జ్యుడీషియరీ కమిటీ ప్రధానమైంది. దీని సబ్-కమిటీ అయిన ‘ఇమ్మిగ్రేషన్ ఇంటెగ్రిటీ, సెక్యూరిటీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సబ్-కమిటీ’ వలస విధానాల నిబంధనలను రూపొందిస్తుంది. సెనెట్‌లో ప్రవేశపెట్టే వలస చట్టాలకు 22 మంది సభ్యులుండే సెనెట్ కమిటీ ఆన్ ది జుడీషియరీ చాలా ముఖ్యమైనది. దీని పరిధిలోని ‘సెనెట్ సబ్‌కమిటీ ఆన్ బోర్డర్ సెక్యూరిటీ అండ్ ఇమ్మిగ్రేషన్’ హెచ్-1బి మరియు గ్రీన్ కార్డ్ చట్టాలపై ప్రభావం చూపుతుంది.నిధులు కేటాయించే హౌస్ అండ్ సెనెట్ అప్రాప్రియేషన్స్ కమిటీలు, పరిపాలనా యంత్రాంగాలపై పర్యవేక్షణ ఉన్న హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కమిటీలు కూడా కీలకమే. జనవరి 2027లో కాంగ్రెస్ కొత్త సభ్యులు ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఈ కమిటీలు పునర్వ్యవస్థీకరిస్తారు. కొత్తగా నియమితులయ్యే ఛైర్పర్సన్లు, ర్యాంకింగ్ మెంబర్ల వైఖరిని బట్టి రాబోయే వలస విధాన సంస్కరణల దిశ స్పష్టమవుతుంది. ప్రస్తుతానికి, హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ నెలకు ఒకసారి విడుదల చేసే ‘వీసా బులెటిన్’ కోసం వేచి చూడక తప్పదు.టెక్సాస్ రిపబ్లికన్ అభ్యర్థి బో ఫ్రాంచ్, ఆసియా సంతతి విద్యార్థులు ఫుట్‌బాల్ విజయాన్ని జరుపుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ స్థానికులను విదేశీయులు ఆక్రమిస్తున్నారని కామెంట్ చేశారు. దీనిపై ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.అమెరికా జనాభాలో భారతీయ-అమెరికన్లు 1.5 శాతం (దాదాపు 52 లక్షల మంది) మాత్రమే ఉన్నప్పటికీ, వారి ఓటింగ్ శాతం అత్యధికంగా ఉంటుంది. (2020లో 71%, 2024లో 70%). వీరి సగటు ఆదాయం జాతీయ సగటు కంటే రెండింతలు ఎక్కువ. అమెరికా ఆదాయపు పన్నులో సుమారు 5-6 శాతం (దాదాపు 250 నుంచి 300 బిలియన్ డాలర్లు) చెల్లింపులు వీరివే కావడం గమనార్హం. కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ, న్యూయార్క్‌తో పాటు జార్జియా, మిచిగాన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా వంటి స్వింగ్ స్టేట్స్లో వీరి ఓట్లు గెలుపోటములను శాసిస్తాయి.

