సీనియర్ జర్నలిస్టు రామ్ కుమార్ లేని లోటు పూడ్చలేనిది…మున్సిపల్ చైర్మన్ ఒద్నాల శ్రీనివాస్.
మంథని: అర్జున్ సమాచారం ప్రతినిధి నవంబర్ 16.
సీనియర్ జర్నలిస్టు, అక్షర యోధుడు కీ.శే. పెండ్యాల రామ్ కుమార్ మృతి మంథని ప్రాంతానికి, జర్నలిస్టు లోకానికి తీరని లోటని మంథని మున్సిపల్ చైర్మన్ ఒద్నాల శ్రీనివాస్ అన్నారు. మంథని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పట్టణంలోని గాంధీ చౌక్‌లో నిర్వహించిన రామ్ కుమార్ సంతాప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత రామ్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఒద్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న రామ్ కుమార్, జర్నలిస్టుగా పేద ప్రజల సమస్యలను అక్షరరూపంలో వెలుగులోకి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి విశేష కృషి చేశారని కొనియాడారు. రామ్ కుమార్ కేవలం విలేకరి మాత్రమే కాదని, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే గొప్ప మనిషి అని అన్నారు. ఎవరికైనా ఆపద వస్తే అండగా నిలిచి భరోసా కల్పించే వ్యక్తిత్వం ఆయనదని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని, ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం రామ్ కుమార్ చేసిన సేవలు మరువలేనివని, ఆయన జర్నలిస్టు ప్రస్థానం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంకరి కుమార్ మాట్లాడుతూ రామ్ కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని, ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అనంతరం పలువురు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చివరగా రెండు నిమిషాలు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వంశీ, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మూల సరోజన, మాజీ ఎంపీపీ కొండ శంకర్, ప్రముఖ న్యాయవాది కేతిరెడ్డి రఘూత్తమ్ రెడ్డి, విద్యార్థి యువత అధ్యక్షులు కొండేల మారుతి, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు బర్ల సంపత్, ప్రధాన కార్యదర్శి పోతరాజు సమ్మయ్య, సహాయ కార్యదర్శి గంధం అంజిబాబు, కోశాధికారి తగరం రాజు, సీనియర్ జర్నలిస్టులు కొమురోజు మారుతి, కొమురోజు చంద్రమోహన్, అంకరి ప్రకాష్, కంది కృష్ణారెడ్డి, ఆర్ల బాపు, లక్కాకుల నాగరాజు, బాసాని సాగర్, దొరగొర్ల రవీందర్, కేసారపు రవి, బండారి సమ్మయ్య తదితరులు, పాత్రికేయులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

