శబరిమల:అర్జున్ సమాచారం:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో రెండు నెలల పాటు సాగే వార్షిక మండల-మకరవిళక్కు యాత్ర మంగళవారం నుంచి వైభవంగా ప్రారంభం కానుంది. మలయాళ మాసం ‘వృశ్చికం’ మొదలవుతుండటంతో కొండపై ‘స్వామియే శరణం అయ్యప్ప’ నామస్మరణ మార్మోగుతోంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకే ఆలయ ద్వారాలు తెరుచుకోనుండగా, మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. మొదటి రోజే స్వామివారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో కొండ దిగువకు చేరుకున్నారు. కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. 41 రోజుల పాటు కఠిన దీక్ష ఆచరించిన స్వాములు నల్లటి వస్త్రాలు ధరించి, నేతి కొబ్బరికాయతో కూడిన ఇరుముడిని తలపై మోస్తూ పంబానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుని నేతి అభిషేకం నిర్వహించనున్నారు. మండల కాలంలో రోజుకు దాదాపు 80,000 మంది భక్తులకు దర్శనం కల్పించేలా తిరువాన్కూర్ దేవస్వం బోర్డు ఏర్పాట్లు చేసింది. ఇందులో 60,000 మందికి వర్చువల్ క్యూ ద్వారా, మిగిలిన వారికి స్పాట్ బుకింగ్ కేంద్రాల ద్వారా దర్శన అవకాశం కల్పిస్తున్నారు. యాత్రికుల రాకతో శబరిమల గిరులు ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తున్నాయి.
=====================
శబరిమలలో ప్రారంభమైన వార్షిక మండల-మకరవిళక్కు యాత్ర మంగళవారం వేకువజాము నుంచే అయ్యప్ప దర్శనానికి భక్తుల అనుమతి – రోజుకు 80 వేల మంది దర్శించుకునేలా ఆలయ బోర్డు ఏర్పాట్లు – పంబ, సన్నిధానం వద్ద 5 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు – తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు
RELATED ARTICLES

