కొక్కిరాల సురేఖ జన్మదినం సందర్భంగా ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
నిరుద్యోగ యువత పోలీస్ ఉద్యోగాలు సాధించడమే ట్రస్ట్ లక్ష్యం – ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,
మంచిర్యాల:అర్జున్ సమాచారం డెస్క్ .నవంబర్ 21
మంచిర్యాల: నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాలు సాధించేందుకు నాణ్యమైన శిక్షణ, అవసరమైన స్టడీ మెటీరియల్ అందించడమే లక్ష్యంగా కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ట్రస్ట్ చైర్మన్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రోజున మరికొంతమంది అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ….నిరుద్యోగ యువతకు పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన నాణ్యమైన శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ అందించడం ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ట్రస్ట్ అందిస్తున్న ఉచిత కోచింగ్ అవకాశాన్ని అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉద్యోగాలు సాధించడం ద్వారా తమ తల్లిదండ్రులకు, కుటుంబాలకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే నిరంతర సాధన, క్రమశిక్షణ, సమయపాలన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి అభ్యర్థి స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. పట్టుదలతో నిరంతరం శ్రమిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని ధైర్యం చెప్పారు.
అలాగే, రాబోయే ఎస్సై, కానిస్టేబుల్ పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల సన్నద్ధతను అంచనా వేసేందుకు ప్రత్యేకంగా గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థులు తమ ప్రస్తుత ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకొని, లోపాలను గుర్తించి మరింత మెరుగైన ప్రణాళికతో ముందుకు సాగేందుకు అవకాశం కల్పించారు.
ఈ కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ కన్వీనర్ శరత్, ఫ్యాకల్టీ ఇన్‌చార్జ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

