రాయచోటి, జూన్ 30,అర్జున్ సమాచారం :
ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో వ్యవసాయ, అనుబంధ శాఖలు ముందస్తు కార్యాచరణతో అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.మంగళవారం మదనపల్లె కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్, మైక్రో ఇరిగేషన్, మార్కెటింగ్, ఫిషరీస్, పశుసంవర్ధక తదితర ప్రైమరీ సెక్టార్ శాఖల అధికారులతో కలెక్టర్ నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నందున కరువు నివారణ, ఉపశమన చర్యలను ఇప్పటి నుంచే చేపట్టాలని సూచించారు.
జిల్లాలో లక్ష ఎకరాల్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) అమలు లక్ష్యంగా పెట్టుకుని రైతులకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. అధిక నీటి అవసరమయ్యే వరి సాగుకు బదులుగా స్థానిక పరిస్థితులకు అనుకూలమైన ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.విత్తన పెల్లెటైజేషన్ కార్యక్రమాన్ని 400 ఎకరాల్లో అమలు చేసి, రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తూ సాంకేతిక మార్గదర్శకాలు అందించాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు సాగు ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు.ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామ స్థాయిలో మరింత విస్తరించేందుకు రైతులకు నిరంతర శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మామిడి తోటల్లో హరిత ఎరువు, ఉలవ వంటి అంతర పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.మామిడి పంటకు ప్రకటించిన కనీస మద్దతు ధర అమలుతో పాటు మార్కెట్‌కు వస్తున్న దిగుబడులపై పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. టమోటాతో పాటు అన్ని పంటలకు క్రాప్ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేసి రైతుల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
సూక్ష్మ నీటిపారుదల పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ వేరుశెనగ సాగులో మినీ స్ప్రింక్లర్ల వినియోగాన్ని విస్తరించాలని, అర్హులైన రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.పశుసంవర్ధక శాఖ అధికారులు పశుగ్రాస అవసరాలను నిరంతరం అంచనా వేసి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ నారాయణ, డీపీఎం వెంకట్ మోహన్, ఏపీఎంఐపీ ప్రసన్న లక్ష్మి, మైక్రో ఇరిగేషన్, మార్కెటింగ్, కోఆపరేటివ్, ఫిషరీస్, పశుసంవర్ధక శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ఫలితాలు అందించే ప్రకృతి వ్యవసాయ విధానాలను గ్రామీణ స్థాయిలో మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు రైతులలో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం చిన్నమండెం మండలం కేశాపురం గ్రామంలో పీఎండీఎస్, విత్తన పెల్లెటైజేషన్ విధానాలపై నిర్వహించిన క్షేత్ర పర్యటనలో భాగంగా ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను కలెక్టరు పరిశీలించారు.ముందుగా రైతు ఖదర్ నిషా అమలు చేస్తున్న పీఎండీఎస్ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్.. పంటల పరిస్థితిని పరిశీలించి, సాగు విధానం, నీటి వినియోగం, ఖర్చులు, దిగుబడులపై రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్కువ నీటితోనూ మెరుగైన దిగుబడులు సాధించేందుకు ఈ విధానం రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు వివరించారు.అనంతరం విత్తన పెల్లెటైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. విత్తనాలకు సహజ పదార్థాలతో పూత పూయడం వల్ల మొలక శాతం పెరగడం, ప్రారంభ దశలో మొక్కల ఎదుగుదల మెరుగుపడడం, తేమ నిల్వ సామర్థ్యం పెరగడం, వేర్ల అభివృద్ధికి దోహదపడడం వంటి ప్రయోజనాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అక్కడి రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ…, ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులను, వర్షపాతం తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీటి అవసరమున్న పంటలపై పూర్తిగా ఆధారపడకుండా, స్థానిక పరిస్థితులకు అనుకూలమైన ఆరుతడి పంటల సాగును, నీటి సంరక్షణ పద్ధతులను గ్రామ స్థాయిలో మరింత విస్తరించేందుకు అధికారులు–రైతులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.ఎల్‌నినో దృష్టిలో ఉంచుకుని ప్రకృతి వ్యవసాయం, ఆరుతడి పంటల సాగు, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, పెసలు, మినుములు, కందులు వంటి తక్కువ నీటి అవసరమున్న పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. నీటి సంరక్షణతో పాటు రైతుల ఆదాయం స్థిరంగా ఉండేలా పంటల వైవిధ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు ఖర్చులు తగ్గడంతో పాటు నేల సారం పెరుగుతుందని, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ సాంకేతికతలను ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి. వెంకట మోహన్, ఎఫ్‌ఎంటి సిద్ధయ్య, పద్మావతి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు, పీఎండీఎస్, విత్తన పెల్లెటైజేషన్ విధానాలు, రైతులకు అందిస్తున్న సాంకేతిక సేవలపై అధికారులు కలెక్టర్‌కు వివరించారు.జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24-7 ప్రకారం నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు మాసవారీ తనిఖీల్లో భాగంగా…. రాయచోటి పట్టణం మార్కెట్ యార్డ్ లో ఉన్న ఈవీఎం గోదామును మంగళవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ లో అంతర్భాగాలను రాజకీయ పార్టీల సమక్షంలో గోదాము లోపల భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాలు బియులు, సియూలు, వివి ప్యాట్ లను, అక్కడి భద్రతా చర్యలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అనంతరం వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డిఓ ఏ. శ్రీనివాస్, తాసిల్దార్ యామిని, ఎలక్షన్ విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
==========================
