గోదావరిఖని,అర్జున్ సమాచారం:
పెద్దపెల్లిజిల్లాలోని గోదావరిఖనిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆహార పదార్థాల నిల్వ, తయారీ, పరిశుభ్రత, వడ్డింపు వంటి అన్ని అంశాల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే సిబ్బందికి ఆహార భద్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని, వినియోగదారుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేసి, అవసరమైన లోపాలను సరిదిద్దిన అనంతరం మాత్రమే తిరిగి నిర్వహణకు అనుమతులు ఇస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.
మే 29న మంథని మార్కెట్ ప్రాంతంలోని శ్రీ సాయి ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ మెస్, జూన్ 13న గోదావరిఖనిలోని డెస్టినేషన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి ఆయా రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు.
తదనంతరం ఆయా సంస్థల నిర్వాహకులు పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేపట్టడంతో, ఫుడ్ సేఫ్టీ అధికారుల పునఃపరిశీలన అనంతరం శ్రీ సాయి ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ మెస్‌కు జూన్ 4న, డెస్టినేషన్ రెస్టారెంట్‌కు జూన్ 30న తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతులు జారీ చేసినట్లు తెలిపారు.
జిల్లాలోని ఇతర హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ఎక్కడైనా అపరిశుభ్రత లేదా నిబంధనల ఉల్లంఘన గుర్తించిన వెంటనే సంబంధిత సంస్థలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
హోటల్, రెస్టారెంట్ నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ నిబంధనలను తూచా తప్పకుండా పాటించి ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ప్రకటన లో పేర్కొన్నారు.
==============================

