భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, జూలై 10:
ఓటరు జాబితా పారదర్శకత, సవరణల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్’ ( ప్రత్యేక సమగ్ర పునశ్చరణ) కార్యక్రమం భీమారం మండలంలో నత్తనడకన సాగుతోంది. ఓటర్ల వివరాల వెరిఫికేషన్ కోసం పంపిణీ చేయాల్సిన ‘సర్’ ఫారాలు ఇప్పటివరకు మండలంలోని మెజారిటీ ఓటర్లకు చేరకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటరు జాబితాను పక్కాగా రూపొందించేందుకు ఈ ప్రక్రియ ఎంతో కీలకమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.
మండలంలోని కొన్ని ప్రాంతాల్లో బూత్ లెవెల్ అధికారులు (బిఎల్ఓ) ఇంటికి వచ్చి కేవలం ఒక్క ఫారం మాత్రమే ఇచ్చి వెళ్లారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో నలుగురు, ఐదుగురు ఓటర్లు ఉన్నప్పటికీ అందరికీ సర్ ఫారాలు రాకపోవడం తో ఇది ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక వేల చివరి నిమిషం లో ఫారాలు ఇస్తే వాటిని ఎలా పూరించాలి, 2002 లిస్ట్ ఎక్కడ ఉంది ఎలా నింపాలి అనే ప్రశ్నలు ప్రజల్లో మెదులుతున్నాయి. అసలు ఈ ఫారాలను ఎప్పుడు పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తారనే దానిపై ఎలాంటి స్పష్టత కరువైంది.
తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలనే ఆసక్తితో, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఓటర్లు బీఎల్ఓలకు ఫోన్లు చేస్తుంటే కనీసం స్పందన కరువైంది. చాలా చోట్ల అధికారుల ఫోన్లు కలవడం లేదని, మరికొన్ని చోట్ల ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని ఓటర్లు వాపోతున్నారు.
క్షేత్రస్థాయిలో ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు సమీక్షించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, భీమారం మండలంలో ‘సర్’ ఫారాల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
