భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, జూలై 09:
స్థానిక భీమారం-5 అంగన్‌వాడీ కేంద్రంలో తీవ్ర కలకలం రేగింది. పౌష్టికాహారం అందించాల్సిన కేంద్రంలోనే పిల్లలకు నాసిరకం, అనారోగ్యకరమైన ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి, పిల్లల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత పూర్తిగా లోపించిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురుగులు పట్టిన పప్పుతో వంటలు చేయడం, కుళ్లిన కోడిగుడ్లను ఉడికించి చిన్నారులకు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఇలాంటి నాసిరకం, కుళ్లిన ఆహారం తిని పిల్లలకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?” అని తల్లిదండ్రులు అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు.
భీమారంలో ఉన్న రెండు అంగన్‌వాడీ కేంద్రాలు(5 &2) వేర్వేరు ప్రాంతాలలో ఉండాల్సింది పోయి, ఒకే ప్రదేశంలో కొనసాగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే చిన్నారులకు రాకపోకలు ఇబ్బందిగా మారాయి. కొన్ని కేంద్రాల్లో కేవలం ఆహారం మాత్రమే పెడుతూ, ప్రీ-ప్రైమరీ (పూర్వ ప్రాథమిక) విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. అందుకే, దూరం ఎక్కువగా ఉన్నప్పటికీ విద్యను బోధించే కేంద్రాలకే తమ పిల్లలను పంపించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
భీమారంలోని అంగన్‌వాడీ కేంద్రాలపై సంబంధిత సూపర్‌వైజర్, సీడీపీఓ ల పర్యవేక్షణ అస్సలు లేకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని గ్రామ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
చిన్నారుల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. నాసిరకం ఆహారాన్ని సరఫరా చేస్తున్న వారిపై మరియు పర్యవేక్షణ లోపించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
