ePaper
Sunday, November 1, 2026
ePaper
Homeతెలంగాణఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ,కార్మిక హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతర...

ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ,కార్మిక హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతర పోరాటం ,నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తాం.

📰 Generate e-Paper Clip

ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ,కార్మిక హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతర పోరాటం ,నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తాం.

మంచిర్యాల జిల్లా:శ్రీరాంపూర్, అక్టోబర్ 31, అర్జున్ సమాచారం ప్రతినిధి.

శ్రీరాంపూర్ ఏరియాలోని సీసీ నరసయ్య భవన్ వద్ద ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కందికట్ల వీరభద్రయ్య హాజరయ్యారు. తొలుత బ్రాంచ్ సెక్రటరీ ఎస్కే బాజీ సైదా ఎర్రజెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కందికట్ల వీరభద్రయ్య, బ్రాంచ్ సెక్రటరీ ఎస్కే బాజీ సైదా మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటాలు చేస్తోందని తెలిపారు. సింగరేణి సంస్థను కాపాడుకోవడం, కార్మికుల సంక్షేమాన్ని పరిరక్షించడం లక్ష్యంగా సేవ్ సింగరేణి జాతా, హెడ్ ఆఫీస్ ముట్టడి, జెన్కో ముట్టడి వంటి కీలక ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగా గుర్తింపు సంఘంగా కార్మికులకు ప్రయోజనం చేకూర్చే 24 కీలక ఒప్పందాలు కుదిరేలా కృషి చేశామని వెల్లడించారు. సొంత ఇంటి పథకం, పెర్క్స్‌పై పన్ను వంటి ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి సంబంధించి కూడా ఒప్పందాలు సాధించామని తెలిపారు. కుదిరిన ఒప్పందాలను క్షేత్రస్థాయిలో అమలు చేయించి కార్మికులకు పూర్తి ప్రయోజనాలు అందేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు.
కార్మికులకు దీపావళి బోనస్, లాభాల వాటా సాధించడంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందని నాయకులు పేర్కొన్నారు. ఏఐటీయూసీ నిరంతర పోరాటాలు, కార్మికుల ఐక్య ఉద్యమాల ఫలితంగానే నేడు సింగరేణి కార్మికులు దీపావళి బోనస్‌తో పాటు లాభాల వాటాను పొందుతున్నారని తెలిపారు. కార్మికులకు రావాల్సిన ప్రతి హక్కు, ప్రయోజనం అందే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేసే వరకు ఏఐటీయూసీ ఉద్యమం కొనసాగుతుందని నాయకులు హెచ్చరించారు. కార్మికులకు నష్టం కలిగించే విధానాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలను ఐక్యం చేస్తూ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కార్మికులు సాధించుకున్న హక్కులను కాపాడటంతో పాటు మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం కోసం నిరంతరం ఉద్యమిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ రాచర్ల చంద్రమోహన్, ఏరియా సెక్రటరీ మూడ సుధాకర్, జిల్లా కార్యదర్శి అప్రోజ్ ఖాన్, అధికార ప్రతినిధి రాజ్ కుమార్, పిట్ సెక్రటరీలు నర్సింగరావు, నాగేశ్వరరావు, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ వెంకటేష్, నాయకులు ప్రతాప్, జీపీ రావు, నరేందర్, సాయిలు, బిరయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!