విద్యుత్ సబ్ ఇంజినీర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.
నాలుగు నెలలుగా పెండింగ్లో మీటర్ కేటగిరీ మార్పు దరఖాస్తు.. ఏడీఈకి మాజీ కౌన్సిలర్ ఫిర్యాదు
అర్జున్ సమాచారం // అక్టోబర్ 16 // చెన్నూరు రిపోర్టర్.
చెన్నూరు (మంచిర్యాల జిల్లా): విద్యుత్ మీటర్ కేటగిరీ మార్పులో నిర్లక్ష్యం వహించడంతో పాటు, ప్రశ్నించిన వినియోగదారుడిని దుర్భాషలాడిన సబ్ ఇంజినీర్పై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ కౌన్సిలర్ రెవెల్లి మహేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఏడీఈ బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు.
చెన్నూరు పట్టణంలోని బేతాళవాడకు చెందిన రెవెల్లి మంగ విద్యుత్ సర్వీస్ నంబర్ 64801-07753కు సంబంధించిన మీటర్ కేటగిరీని 1 నుంచి 2కు మార్చాలని నాలుగు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నట్లు మహేష్ తెలిపారు. అయితే, సబ్ ఇంజినీర్ నాగరాజు ఆ దరఖాస్తును పెండింగ్లో ఉంచుతూ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్నించినందుకు దుర్భాషలాడారని పేర్కొన్నారు.
మీటర్ కేటగిరీ మార్పు చేయకపోవడం వల్ల రూ.18,000 విద్యుత్ బిల్లు వచ్చిందని మహేష్ తెలిపారు. ఈ బిల్లుకు సబ్ ఇంజినీర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ, ఆ మొత్తాన్ని సంబంధిత అధికారి జీతం నుంచి రికవరీ చేయాలని వినతిపత్రంలో కోరారు. అలాగే, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఏడీఈ బాలకృష్ణను కోరారు.

