క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
మిషన్ భగీరథలో లోపాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి
వీబీజీ–రామ్జీ పనులు, జలసిరి కార్యక్రమాన్ని నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలి సమీక్షించిన జిల్లా కలెక్టర్
అర్జున్ సమాచారం ,ఆగస్టు-6:
ముత్తారం. రిపోర్టర్
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి అంచనాలు సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.
గురువారం ముత్తారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీరు, ఐ.సి.డి. ఎస్,పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, నీటిపారుదల, విద్యుత్, ఉద్యానవనం, రవాణా, ఆర్ అండ్ బీ, వీబీజీ–రామ్జీ పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు సమావేశంలో లేవనెత్తిన సమస్యలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు గ్రామాల్లో తరచూ పర్యటించాలని సూచించారు.
మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా పైప్లైన్ వ్యవస్థలో ఉన్న లోపాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి, అవసరమైన నిధుల మంజూరుకు కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్న వెంటనే మరమ్మతులు చేపట్టాలని, అవసరమైతే కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారులు ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, యూరియా సరఫరా పకడ్బందీగా జరిగేలా చూడాలని తెలిపారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, వైద్యులు సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.
వీబీజీ–రామ్జీ పథకం కింద చేపడుతున్న జలసిరి కార్యక్రమంలోని ఇంకుడు గుంతలు, పంటకుంటలు, ఇతర అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి ఎం. రవీందర్, ఎంపీడీవో ఐ. ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

