నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి,అసంక్రమిత వ్యాధుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించాలి,
వ్యాధుల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలి: డీఎంహెచ్ఓ డాక్టర్ నరేంద్ర రాథోడ్.
అర్జున్ సమాచారం // అక్టోబర్ 15 // స్టాఫ్ రిపోర్టర్ // మంచిర్యాల జిల్లా:
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు సీజనల్ వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేంద్ర రాథోడ్ వైద్యులు, సిబ్బందికి సూచించారు. గురువారం మంచిర్యాల జిల్లా నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి, అక్కడ అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలు, వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు.
30 ఏళ్లు దాటిన వారికి ఆరోగ్య పరీక్షలు
30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ రక్తపోటు, మధుమేహం వంటి అసంక్రమిత వ్యాధులకు సంబంధించి పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ ఆదేశించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాధిగ్రస్తులకు క్రమం తప్పకుండా మందులు అందించాలని, రోగుల వివరాలను ఆధార్ కార్డు ఆధారంగా నమోదు చేయాలని తెలిపారు. ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న మందుల నిల్వలను పరిశీలించారు.
వ్యాధుల నివారణకు సమష్టి కృషి అవసరం
వ్యాధులు ప్రబలే ప్రాంతాలను గుర్తించి, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు వ్యాధుల నివారణపై అవగాహన కల్పించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు ప్రతి వారం రెండు రోజులు పొడి దినోత్సవాన్ని పాటించేలా ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారు.
గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
గర్భిణుల వివరాలను నమోదు చేసి, నిర్ణీత సమయాల్లో అవసరమైన టీకాలు అందేలా చూడాలని డాక్టర్ నరేంద్ర రాథోడ్ సూచించారు. గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చేతుల పరిశుభ్రతతో వ్యాధులకు దూరంగా ఉండొచ్చు
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యాన్ని వివరిస్తూ, భోజనానికి ముందు, మరుగుదొడ్డి వినియోగించిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని డీఎంహెచ్ఓ ప్రజలకు సూచించారు. చేతుల పరిశుభ్రత పాటించకపోవడం వల్ల అతిసారం, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలు, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్, జిల్లా ప్రజారోగ్య సమాచార అధికారి బుక్కా వెంకటేశ్వర్, నర్సింగ్ అధికారులు కవిత, ఆశా కార్యకర్తలు, వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

