ePaper
Saturday, September 5, 2026
ePaper
Homeఎడిటోరియల్ఈఓఎస్  శాటిలైట్ సక్సెస్

ఈఓఎస్  శాటిలైట్ సక్సెస్

📰 Generate e-Paper Clip

ఈఓఎస్  శాటిలైట్ సక్సెస్

హైదరాబాద్, సెప్టెంబర్ 4,(అర్జున్ సమాచారం ప్రతినిధి)

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో విజయాన్ని అందుకుంది. రక్షణ, విపత్తు నిర్వహణ రరంగాల్లో అత్యంత కీలకమైన ఈఓఎస్‌-05 (జీశాట్‌ 1ఏ) శాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించింది సత్తా చాటింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) రెండవ ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం (సెప్టెంబర్ 4) తెల్లవారుజామున 2:55 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్ళింది. సరిగ్గా 18 నిమిషాల వ్యవధిలో అంటే 3 గంటల 13 నిమిషాలకు 2,367 కేజీల బరువున్న జీశాట్‌ 1ఏ ఉపగ్రహాన్ని రాకెట్ అత్యంత కచ్చితత్వంతో సబ్‌-జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువు కలిగిన ఈ రాకెట్‌తో చేపట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో చేసిన 19వ ప్రయోగం ఇది అని తెలిపారు.ఈఓఎస్‌-05 ఉపగ్రహం భూస్థిర కక్ష్యలో ఉంటూనే మొత్తం దక్షిణాసియాను ఒకే ఫ్రేమ్‌లో, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి భారత ఉపఖండాన్ని మొత్తం ఫొటో తీయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సాధారణంగా సన్ సింక్రోనస్ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్‌లో ఉండే ఉపగ్రహాలు ఒక ఏరియాను ఫొటో తీసేందుకు రోజుల నుంచి వారాలపాటు టైమ్ తీసుకుంటాయి. లేటెస్ట్ శాటిలైట్ మాత్రం నిమిషాల వ్యవధిలో అద్భుతమైన ఫొటోలు తీయగలదు. ఇందులో అమర్చిన ఎంఎక్స్‌-వీఎన్‌ఆర్‌ పేలోడ్ ఒక పిక్సెల్‌కు 42 మీటర్ల స్పేషియల్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. భూస్థిర కక్ష్యలో ఇంతటి అత్యుత్తమ రిజల్యూషన్ కలిగిన కెమెరాను కలిగిన ప్రపంచంలోనే తొలి ఉపగ్రహంగా ఈఓఎస్ 05 శాటిలైట్ నిలిచింది. ప్రస్తుతం ఉన్న ఇస్రో సామర్థ్యం కంటే దీని పిక్సెల్ డెన్సిటీ 567 రెట్లు మెరుగ్గా ఉంటుంది. ఇస్రో చేసిన ఈ తాజా ప్రయోగం దేశ భద్రత,  విపత్తుల నిర్వహణలో గేమ్‌ ఛేంజర్‌గా మారనుందని చెప్పవచ్చు. సరిహద్దుల్లో శత్రు దేశాల సైనిక స్థావరాలను అత్యంత సులువుగా పసిగట్టడంతో పాటు, వరదలు, తుపాన్లు, కార్చిచ్చుల వంటి విపత్తుల తీవ్రతను రియల్- టైమ్‌లో అంచనా వేయడానికి శాటిలైట్ తోడ్పడుతుంది. అలాగే పంటల ఆరోగ్యం, అటవీ ప్రాంతాలు, నీటి వనరులలో కాలుష్యం, ఖనిజ సంపద వివరాలను దీనిలోని హైపర్, మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలు గుర్తించి వివరాలు అందిస్తాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.2021 ఆగస్టులో చేసినా ప్రయోగం సక్సెస్ కాలేదు. కానీ ఇస్రో శాస్త్రవేత్తలు పట్టు విడవకుండా ప్రయత్నించి విజయం సాధించి దేశం గర్వించేలా చేశారు. గతంలో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 వైఫల్యం వల్ల జీశాట్‌-1 శాటిలైట్ కక్ష్యను చేరుకోలేకపోయింది. ఇస్రో మరింత మెరుగైన టెక్నాలజీతో ఈఓఎస్‌-05ను ప్రయోగించి విజయాన్ని అందుకుని సత్తా చాటింది. కాగా, ఈ ప్రయోగం చేస్తున్న సమయానికి కుండపోత వర్షం కురుస్తోంది. అయినప్పటికీ లాంచ్ వ్యూ గ్యాలరీకి 1,500 మంది వరకు వచ్చిన సందర్శకులు వానలో తడుస్తూనే ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించి ఇస్రో శాస్త్రవేత్తలను ఉత్సాహపరిచారు. దేశాన్ని గర్వించేలా చేసిన ప్రయోగాన్ని వీక్షిస్తూ చప్పట్లతో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!