కరిగిపోతున్న డాలర్ డ్రీమ్స్.
విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 19.
అమెరికాలో ఉన్నత విద్య , ఆపై మంచి ఉద్యోగం.. ఇది ప్రపంచంలోని చాలా మంది డ్రీమ్. దశాబ్దాలుగా భారతీయులకు కూడా అమెరికా ఫస్ట్ చాయిస్. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. వీసా అనిశ్చితులు, క్లిష్టమైన ఉద్యోగ మార్కెట్, మారుతున్న వలస విధానాల కారణంగా అమెరికాలో చదువుకోవాలనే విద్యార్థుల నిర్ణయాలు సంక్లిష్టంగా మారాయి. ఫలితంగా 2025-26 విద్యా సంవత్సరంలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య 6 శాతం తగ్గి 3,39,435కు చేరుకుంది. ఇదే సమయంలో చైనా విద్యార్థుల సంఖ్య 4 శాతం తగ్గి 2,54,458కి పరిమితమైంది.అన్నింటికంటే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అమెరికా విద్యాసంస్థల్లో కొత్తగా చేరుతున్న విద్యార్థుల సంఖ్య. 2025-26లో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలు 18 శాతం పడిపోయి 2,28,123కు చేరాయి. గతంలో చేరిన మొత్తం విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే, ఈ గణాంకాలు విద్యార్థులు ఇప్పటికీ అమెరికాను ఎంచుకుంటున్నారా? లేదా? అనేదానికి స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తాయి.‘ఫాల్ 2026 స్నాప్‌షాట్’ నివేదిక ప్రకారం.. ఈ తగ్గుదల మరింత కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న విద్యాసంస్థల వివరాల ప్రకారం.. గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య 15 శాతం, అండర్ గ్రాడ్యుయేట్ల సంఖ్య 3 శాతం, ఓపీటీ విద్యార్థుల సంఖ్య 6 శాతం తగ్గింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే కొత్త అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలు 15 శాతం తగ్గాయి.ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ నవంబర్ 16న విడుదల చేసిన ‘ఓపెన్ డోర్స్ 2026’ నివేదిక ప్రకారం.. 2025-26లో అమెరికా ఉన్నత విద్యాసంస్థల్లో మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 3 శాతం తగ్గి 11,46,163కు చేరుకుంది. 800కు పైగా విద్యాసంస్థలపై నిర్వహించిన ప్రత్యేక ‘ఫాల్ 2026 స్నాప్‌షాట్’ సర్వేలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 9 శాతం తగ్గగా, కొత్త ప్రవేశాలు 15 శాతం పడిపోయినట్లు నమోదైంది.భారత్ విషయానికొస్తే ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఏడాది క్రితం అంటే 2024-25లో అంతకుముందు ఏడాది కంటే 10 శాతం వృద్ధితో భారత్ నుంచి రికార్డు స్థాయిలో 3,63,019 మంది విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. వరుసగా మూడో ఏడాది కూడా చైనాను వెనక్కి నెట్టి అమెరికాకు అత్యధిక మంది విద్యార్థులను పంపే దేశంగా భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ, ఆ వేగం మాత్రం మందగించింది. అమెరికాలోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 52 శాతం మంది భారత్, చైనాకు చెందినవారే.భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఇష్టపడే ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్ కోర్సులు ఉండే ‘గ్రాడ్యుయేట్’ (మాస్టర్స్) స్థాయిలోనే ఈ తగ్గుదల ఎక్కువగా ఉంది. భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య ఏకంగా 34 శాతం పడిపోయి 1,16,609కు చేరగా, అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలు కేవలం 1 శాతం తగ్గి 39,711 వద్ద నిలిచాయి.ఈ వ్యత్యాసం చాలా విషయాలను స్పష్టం చేస్తోంది. చాలా భారతీయ కుటుంబాలకు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ అంటే కేవలం చదువుకు సంబంధించిన పెట్టుబడి మాత్రమే కాదు.. అది వృత్తిపరమైన అనుభవం, మెరుగైన సంపాదన, దీర్ఘకాలిక విదేశీ కెరీర్‌కు ఒక మార్గం. అమెరికాలో చదువు ఖర్చు భారీగా పెరుగుతున్న తరుణంలో, చదువు పూర్తయ్యాక ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకం సన్నగిల్లడం విద్యార్థులను ఆలోచనలో పడేస్తోంది.ఇప్పటికే అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నవారు లేకపోయి ఉంటే, భారతీయ విద్యార్థుల సంఖ్యలో ఈ తగ్గుదల మరింత తీవ్రంగా ఉండేదని నిపుణులు చెబుతున్నారు. చదువు తర్వాత తాత్కాలికంగా పనిచేసేందుకు వీలుకల్పించే ఓపీటీ కింద ఉన్న భారతీయుల సంఖ్య 27 శాతం పెరిగి 1,82,201కు చేరుకుంది. నివేదికలోని మొత్తం భారతీయ విద్యార్థుల్లో వీరే సగానికి పైగా ఉన్నారు.మరోవైపు, చైనా విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల కొంత తక్కువగానే ఉంది. చైనా గ్రాడ్యుయేట్ విద్యార్థులు 5 శాతం తగ్గి 1,14,043కు, అండర్ గ్రాడ్యుయేట్లు 5 శాతం తగ్గి 74,594కు, ఓపీటీలో ఉన్నవారు 1 శాతం తగ్గి 61,545కు పరిమితమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల విద్యార్థులను కలిపి చూస్తే, మాస్టర్స్ విద్యార్థులు 22 శాతం తగ్గడంతో మొత్తం గ్రాడ్యుయేట్ ప్రవేశాలు 13 శాతం పడిపోయి 4,23,078కు చేరాయి. అయితే డాక్టోరల్ (పీహెచ్డీ) విద్యార్థుల సంఖ్య 3 శాతం పెరగగా, అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల్లో పెద్దగా మార్పు లేకుండా 3,56,165 వద్ద స్థిరంగా ఉన్నాయి.ఓపీటీ గణాంకాలు ప్రత్యేకంగా గమనించాల్సినవి. ఎందుకంటే గత కొన్నేళ్లుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అంతర్జాతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉండటంతో 2025-26లో ఓపీటీలో ఉన్నవారి సంఖ్య 14 శాతం పెరిగి 3,35,785కు చేరుకుంది. అయితే, ఈ విభాగం కూడా ఇప్పుడు తగ్గుముఖం పట్టడం ప్రారంభమైందని తాజా సర్వే సూచిస్తోంది.అమెరికా విశ్వవిద్యాలయాలకు ఈ పరిణామాలు కేవలం అడ్మిషన్లకే పరిమితం కావు. అంతర్జాతీయ విద్యార్థులు వాటికి గణనీయంగా ఆదాయం, పరిశోధన ప్రతిభ, నైపుణ్యం కలిగిన గ్రాడ్యుయేట్లను అందించే ప్రధాన వనరులు. అమెరికా వాణిజ్య శాఖ ప్రకారం.. 2025లో అంతర్జాతీయ విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు దాదాపు 56 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చారు.అందుకే అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించాలనే ఆసక్తి అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఇంకా బలంగానే ఉంది. ‘ఫాల్ స్నాప్‌షాట్’ సర్వేలో 75 శాతం విద్యాసంస్థలు క్యాంపస్‌లో అంతర్జాతీయ దృక్పథం అవసరమని పేర్కొనగా, 60 శాతం సంస్థలు విదేశీ విద్యార్థుల ఆర్థిక సహకారాన్ని అంగీకరించాయి. ఏకంగా 91 శాతం విద్యాసంస్థలు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడానికి తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపాయి. 75 శాతం సంస్థలు కంప్యూటర్ సైన్స్‌ను, చెరో 59 శాతం సంస్థలు ఇంజనీరింగ్, బయోలాజికల్ సైన్సెస్‌ను తమ ప్రధాన రిక్రూట్మెంట్ విభాగాలుగా గుర్తించాయి. 2025-26లో మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో 57 శాతం మంది స్టెమ్ (STEM) కోర్సుల్లోనే ఉన్నారు. ఇందులో మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్‌లో 2,86,168 మంది, ఇంజనీరింగ్‌లో 2,14,193 మంది విద్యార్థులు చదువుతున్నారు.

