కోర్టు ఆదేశాలతో పెంపుడు తల్లిదండ్రుల చెంతకు చేరిన బాలుడు.
తల్లిదండ్రులు కావాలంటూ కన్నీటిపర్యంతమైన చిన్నారి.. .ఎట్టకేలకు కుటుంబానికి అప్పగింత,
జగిత్యాల జిల్లా ప్రతినిధి :అర్జున్ సమాచారం నవంబర్ 3 ::
జగిత్యాల జిల్లాలో పెంపుడు తల్లిదండ్రులకు దూరమైన బాలుడు ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో తిరిగి వారి చెంతకు చేరాడు. కొంతకాలంగా పెంపుడు తల్లిదండ్రులకు దూరంగా శిశు సంక్షేమ శాఖ ఆధీనంలో ఉంటున్న బాలుడు, తనకు అమ్మ కావాలంటూ రోదించిన దృశ్యాలు పలువురిని కలచివేశాయి.
బాలుడిని పెంపుడు తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిశు సంక్షేమ శాఖ ఆధీనంలో ఉంచడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. తనను పెంచిన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలంటూ బాలుడు ఏడుస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగించాయి. ఈ నేపథ్యంలో బాలుడి పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.
కోర్టు ఆదేశాలను అనుసరించి శిశు సంక్షేమ శాఖ అధికారులు బాలుడిని ఎట్టకేలకు పెంపుడు దంపతులకు అప్పగించారు. దీంతో బాలుడు తిరిగి వారి చెంతకు చేరడంతో ఈ వ్యవహారానికి తాత్కాలికంగా తెరపడింది.
చిన్నారుల సంరక్షణకు సంబంధించిన అంశాల్లో వారి భద్రతతో పాటు మానసిక పరిస్థితి, భావోద్వేగాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

