ఫ్లోరింగ్ పనులతో ప్రయాణికులకు ఇబ్బందులు తొలగింపు.
అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 21 | ముత్తారం రిపోర్టర్.
ముత్తారం మండలంలోని హరిపురం గ్రామ బస్టాండ్లో వర్షపు నీరు నిలిచే సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. బస్టాండ్ ప్రాంగణం ప్రధాన రహదారి కంటే కింది స్థాయిలో ఉండటంతో వర్షాలు కురిసిన ప్రతిసారి నీరు నిలిచిపోయేది. దీంతో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు, విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
బస్టాండ్ ఆవరణలో నీరు నిలిచి బురదగా మారడంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో పాటు దోమల బెడద కూడా ఏర్పడేది. వర్షం కురిసిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.
ఈ సమస్యను గుర్తించిన గ్రామ సర్పంచ్ మెంగని సమత తిరుపతి బస్టాండ్ ప్రాంతాన్ని పరిశీలించి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం బస్టాండ్ ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు చేపట్టి, వర్షపు నీరు నిలిచిపోకుండా ప్రాంగణ స్థాయిని సరిచేశారు. నీరు బయటకు వెళ్లేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు.
చాలాకాలంగా ఉన్న సమస్యకు సర్పంచ్ చొరవతో పరిష్కారం లభించడంతో హరిపురం గ్రామస్థులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

