ఇంటింటి సర్వేతో ప్రజా సమస్యల పరిష్కారానికి న్యాయ సేవాధికార సంస్థ చొరవ…
నర్సింహులపల్లిలో వారం రోజుల పాటు సమగ్ర సర్వే…
ధర్మారం:అర్జున్ సమాచారం ,నవంబర్ 19 .
ధర్మారం: ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, వారి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. గౌరవ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సునీత కుంచాల ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఎంపిక చేసిన నర్సింహులపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
నవంబర్ 19 నుంచి 25వ తేదీ వరకు వారం రోజుల పాటు పారాలీగల్ వాలంటీర్లు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి సమగ్ర సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వే ద్వారా గ్రామ ప్రజల సమస్యలు, వారికి అవసరమైన న్యాయ సహాయం, ప్రభుత్వ శాఖల ద్వారా పరిష్కరించాల్సిన అంశాలను గుర్తించనున్నారు. ప్రజలకు న్యాయ సేవాధికార సంస్థ అందించే సేవలపై అవగాహన కల్పించడంతో పాటు, న్యాయం పొందేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను వివరించనున్నారు.
ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామంలో ఎవరికైనా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా లేదా ఇతరత్రా సమస్యలు ఉన్నట్లయితే తమ ఇంటికి వచ్చే పారాలీగల్ వాలంటీర్లకు తెలియజేయాలని సూచించారు. ప్రజలు తెలిపిన సమస్యలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు అవసరమైన న్యాయ సహాయం అందించడంతో పాటు, వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలు చూపించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, అవుల .మల్లయ్య వార్డు సభ్యులు పాల్గొని సర్వే నిర్వహణకు సహకరించారు. పారాలీగల్ వాలంటీర్లు ఎల్క సదానందం, కోడూరు వెంకటేశం, తాటిపాముల శ్రీనివాస్, తాటిపాముల రాజ్యలక్ష్మి, చిప్పకుర్తి సతీష్, ప్రశాంత్, చీటి మహేష్ కుమారి, రాజేందర్ తదితరులు ఇంటింటికీ వెళ్లి ప్రజల వివరాలు సేకరించే కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రామస్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పారాలీగల్ వాలంటీర్లకు తెలియజేయాలని, తద్వారా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందుబాటులో ఉన్న సహాయాన్ని పొందాలని నిర్వాహకులు కోరారు.

