శ్రీశైలం, శ్రీకాళహస్తి, పంచారామాల్లో బారులు..
అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 24.
ఆంధ్రప్రదేశ్‌లో జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజల కోసం.
భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. మరోవైపు పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని శివాలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా
జరుగుతున్నాయి. ఏటా కార్తీక పౌర్ణమి నాడు ఒకే రోజు ఐదు పంచారామాలను దర్శించుకునే భక్తుల రాకతో ఆయా క్షేత్రాల వద్ద సందడి నెలకొంది. నదీ స్నానాలు.. 365 వత్తుల దీపారాధన..
పౌర్ణమి పుణ్యదినాన గోదావరి, కృష్ణా నదీ తీరాల్లోని స్నానఘట్టాలు భక్తులతో నిండిపోయాయి. చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునే నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, అరటి దొప్పల్లో
దీపాలు వెలిగించి నదీ జలాల్లో వదులుతూ వరుణ దేవునికి, శివకేశవులకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణాలు, గృహాల్లోని తులసి, ఉసిరి చెట్ల వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు.
నిర్వహించారు. ఏడాది పొడవునా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందన్న విశ్వాసంతో 365 వత్తులతో కూడిన ప్రత్యేక దీపాలను వెలిగించారు. సాయంత్రం పలు ప్రధాన శివాలయాల్లో నిర్వహించనున్న
‘జ్వాలా తోరణం’ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
• అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు..
కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని ముందుగానే అంచనా వేసిన దేవాదాయ శాఖ, ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామివారి
దర్శనం కల్పించేందుకు ప్రత్యేక క్యూ లైన్లు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం, ప్రసాద వితరణలో ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
నదీ ఘాట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు, ప్రధాన ఆలయాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.

