జాతీయ సంఘాలపై విరక్తితో టీబీజీకేఎస్లోకి మైనింగ్ స్టాఫ్ సూపర్వైజర్లు,
కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాడుతాం.. సింగరేణి కార్మిక గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపు.
అర్జున్ సమాచారం//అక్టోబర్ 14// రామగిరి రిపోర్టర్.
సింగరేణిలో మైనింగ్ స్టాఫ్ సూపర్వైజర్లు పెద్ద సంఖ్యలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)లో చేరారు. జాతీయ కార్మిక సంఘాలపై నమ్మకం కోల్పోయామని, కార్మికుల హక్కుల పరిరక్షణకు టీబీజీకేఎస్ ద్వారా ముందుకు సాగుతామని వారు ప్రకటించారు.
గతంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలకు పలుమార్లు మద్దతు తెలిపి గుర్తింపు సాధనలో సహకరించినప్పటికీ, మైనింగ్ స్టాఫ్ సూపర్వైజర్ల సమస్యలు పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మెడికల్ అన్ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్కు తగిన సూటబుల్ ఉద్యోగాలు కల్పించాలనే దీర్ఘకాలిక డిమాండ్ను జాతీయ సంఘాలు ఎన్నికల సమయంలో హామీగా ఇచ్చి, అనంతరం పట్టించుకోలేదని ఆరోపించారు. 1998 తర్వాత మెడికల్ అన్ఫిట్ ఉద్యోగులకు జనరల్ మజ్దూర్ ఉద్యోగాలు కల్పించినప్పటికీ, ఆ తర్వాత సరైన విధానం అమలు కాలేదని పేర్కొన్నారు. ఇటీవలి మెడికల్ బోర్డుల్లోనూ జనరల్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం చేయడం నిరాశ కలిగించిందన్నారు.
ఇకపై పరోక్ష మద్దతుకే పరిమితం కాకుండా, ప్రత్యక్షంగా కార్మికులను చైతన్యపరుస్తూ టీబీజీకేఎస్ బలోపేతానికి కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు.
పలువురు నాయకుల చేరిక
ఈ సందర్భంగా ఓసీపీ-1 మైనింగ్ స్టాఫ్ కన్వీనర్ కల్వల రమేష్, కో-కన్వీనర్ కె. వెంకటరమణారెడ్డి, డీటీ రావు, సంపత్, సమ్మయ్య, రాజేశంతో పాటు పలువురు హెడ్ ఓవర్మెన్లు టీబీజీకేఎస్లో చేరారు. ఐఎన్టీయూసీకి చెందిన నాయకులు కొప్పుల సంజీవ్ కుమార్, జీల సమ్మయ్య, ఎం.డి. యాసిన్, ఒగ్గె రవీందర్, వంటకాల తిరుపతి, ఎం.డి. అహ్మద్ తదితరులు కూడా టీబీజీకేఎస్లో చేరినట్లు నాయకులు తెలిపారు.
కార్మిక గర్జన సభను విజయవంతం చేయాలి
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్కు ఆర్జీ-3 ఏపీ ఉపాధ్యక్షుడు నాగెళ్లి సాంబయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీ పింగిలి సంపత్ రెడ్డి, ఓసీపీ-1 ఫిట్ సెక్రటరీ గిటుకు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మాదాసు రామ్మూర్తి, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య పాల్గొని మాట్లాడారు.
కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం సంఘటిత పోరాటం అవసరమని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గోదావరిఖనిలో నిర్వహించే ‘సింగరేణి కార్మిక గర్జన’ బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సింగరేణి పరిరక్షణతో పాటు కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ఇటీవల ప్రకటించిన లాభాల వాటా కూడా కార్మిక గర్జన ప్రభావంతోనే వెలువడిందని నాయకులు అభిప్రాయపడ్డారు. జీవో 76 అమలు, సింగరేణికి ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.60 వేల కోట్ల బకాయిలు, మెడికల్ బోర్డుల్లో పారదర్శకత, సంస్థలో అవినీతి, టెండర్లలో అక్రమాల ఆరోపణలపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్జీ-2 వైస్ ప్రెసిడెంట్ అయిలి శ్రీనివాస్, సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈసంపల్లి రమేష్, శ్రీకాంత్ రావు, బ్రాంచ్ సెక్రటరీలు మహిపాల్ రెడ్డి, దాసరి మల్లేష్, కొండ రవి, మహేందర్, విజయ్, పూర్ణాకర్, సైండ్ల సత్యనారాయణ, సీహెచ్ శ్రీనివాస్, కే. వేణుగోపాల్, బి. రవీందర్, బుద్ధి ఉదయ్, వేణుగోపాల్ రెడ్డి, గుడెల్లి రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

