ప్రజా సమస్యలు కాదు… డ్రామాలతో సరి
హైదరాబాద్, సెప్టెంబర్ 10, (అర్జున్ సమాచారం ప్రతినిధి)
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండు రోజుల పాటు సభ లోపల నడవాల్సిన ప్రజా సమస్యల చర్చ కంటే, బయట నడిచిన రాజకీయ హైవోల్టేజ్ డ్రామానే ఊహించని మలుపులు తిరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, నెరవేర్చని ఆరు గ్యారెంటీలు, హామీల వైఫల్యాలపై పక్కా చార్జ్‌షీట్ తో ప్రభుత్వాన్ని శాసనసభ వేదికగా ఎండగట్టాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహం రచించింది. కేటీఆర్, హరీశ్‌రావుల నాయకత్వంలో నల్ల చొక్కాలు ధరించి, ప్లకార్డులతో మీడియా మైలేజ్ సాధించడమే లక్ష్యంగా అసెంబ్లీ గేట్ వద్దకు చేరుకున్నారు. అయితే, ఆరంభంలోనే బీఆర్ఎస్ ఆశించిన పొలిటికల్ మైలేజ్ కాస్తా, కాంగ్రెస్ విసిరిన పక్కా పొలిటికల్ ట్రాప్‌లో పడి పూర్తిగా ఆవిరైపోయింది.అసెంబ్లీ గేటు వద్ద భద్రతా సిబ్బంది ఆంక్షలు విధించడంతో చోటుచేసుకున్న నెట్టివేతలు, తోపులాటల సమయం వరకు బీఆర్ఎస్ వ్యూహం బాగానే అమలైంది. కేటీఆర్, హరీశ్‌రావు సహా ప్రజాప్రతినిధుల అరెస్టులు, మహిళా నేతల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ప్రతిపక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేసింది. కానీ, నిరసన ఆవేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు మైండ్ గేమ్‌ను ఒక్కసారిగా తిరగరాశాయి. పోలీసులతో వాగ్వాదంలో దళిత వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యవస్థను ఉద్దేశించి ఆయన మాట్లాడారంటూ కాంగ్రెస్ శ్రేణులు వీడియో క్లిప్‌లతో తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగాయి. ఈ ఒక్క అవకాశాన్ని పట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు రాజకీయాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సభ లోపల స్పీకర్ భోరున విలపించడం, కాంగ్రెస్ నేతలు దళిత ఆత్మగౌరవ సెంటిమెంట్‌ను రగల్చడంతో అసలు కథ పక్కదారి పట్టింది. ప్రభుత్వంపై రావలసిన ‘వెయ్యి రోజుల వైఫల్యాల’ చర్చ కాస్తా, బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలు , స్పీకర్ అవమాన ఘటన చుట్టూ తిరిగేలా కాంగ్రెస్ నేతలు నరేటివ్‌ను సెట్ చేయగలిగారు. దీంతో ప్రభుత్వాన్ని కార్నర్ చేయాల్సిన బీఆర్ఎస్, అనూహ్యంగా ఆత్మరక్షణలో పడి వివరణలు ఇచ్చుకునే పరిస్థితికి దిగజారింది.రెండో రోజు పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ రెడ్డిలను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద పోలీసులు మంగళవారం ఉదయాన్నే వారి నివాసాల వద్ద అరెస్ట్ చేయడం కాంగ్రెస్ మైండ్ గేమ్‌లో పరాకాష్టగా నిలిచింది. కేటీఆర్, హరీశ్‌రావులపై కూడా కేసులు నమోదు కావడం, శాసనమండలిలో ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టడంతో బీఆర్ఎస్ నాయకత్వం డిఫెన్స్‌లో పడిపోయింది. రెండు రోజుల అసెంబ్లీ ఘట్టాలను నిశితంగా పరిశీలిస్తే, ఆరంభంలో హంగామా చేసి మీడియా దృష్టిని ఆకర్షించిన బీఆర్ఎస్, చివరకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా విసిరిన ‘సభా సంప్రదాయాలు – దళిత సెంటిమెంట్’ అనే ఆత్మరక్షణ ట్రాప్‌లో దారుణంగా చిక్కుకుపోయింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన కీలక సమయాన్ని బీఆర్ఎస్ తమ నేతల అరెస్టులు, క్షమాపణలు, వివరణలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాజకీయాల్లో ప్రత్యర్థులను రెచ్చగొట్టి తప్పులు చేయించడమే అసలైన వ్యూహమైతే, ప్రస్తుత పోరులో అధికార కాంగ్రెస్ విసిరిన గేండ్లో బీఆర్ఎస్ దారుణంగా దొరికిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్ మీడియా ముందూ, పోలీసుల వద్ద వాడిన తీవ్రమైన, అకోపపూరిత భాష ప్రతిపక్షానికి రాజకీయంగా ఎలాంటి మైలేజ్‌ను అందించలేకపోయింది. ఎమ్మెల్సీ తాతా మధు చేసిన తొందరపాటు వ్యాఖ్యల వల్లే ఈ వివాదమంతా మొదలైందనే విషయాన్ని కేటీఆర్ పక్కనపెట్టి, అదే స్థాయి ఆక్రోశాన్ని ప్రదర్శించడంతో కథ కాంగ్రెస్‌కు అనుకూలంగా మారింది. చివరికి, షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సభా ప్రాంగణం బయట “కేసీఆర్ చావు కోరుకుంటున్నట్లు, ఎర్రవల్లి నివాసానికి చావు డప్పు కొడతామంటూ” చేసిన వికృత వ్యాఖ్యలను సైతం ప్రజాక్షేత్రంలో సెంటిమెంట్‌గా మార్చుకుని సానుభూతి సాధించడంలో బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైంది. కేటీఆర్ తీవ్రమైన భాషను పక్కనపెట్టి, ప్రజాస్వామ్యయుతమైన శైలితో నిలదీసి ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై ప్రజల సానుభూతి పూర్తిగా కేసీఆర్‌కే దక్కేది. కానీ, కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా రగిల్చిన ఆవేశపు ట్రాప్‌లో పడి బీఆర్ఎస్ రెచ్చిపోవడం వల్ల, ప్రత్యర్థి చేసిన పెద్ద తప్పు కూడా కప్పిపోయి.. చివరికి బీఆర్ఎస్కే రాజకీయంగా తీవ్ర నష్టం చేకూరింది.
నోరు తెచ్చిన తంటా
తెలంగాణ రాజకీయాల్లో తిట్లు, వ్యంగ్యాస్త్రాలు కొత్త కాదు. కానీ, ఒకప్పుడు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అదే భాష.. ఇప్పుడు బీఆర్ఎస్ మెడకే చుట్టుకుంటోందా? తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ వాడిన నాటు భాష, యాస ప్రజలను కదిలించి ఒక ఎమోషన్‌ను సృష్టించాయి. అధికారంలో ఉన్నన్నాళ్లూ మా భాషే ఇంత.. ఇది తెలంగాణ మట్టి వాసన అంటూ సమర్థించుకున్నారు. కానీ కాలం మారింది, పాత్రలు మారాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న గులాబీ నేతలు వాడుతున్న ఆవేశపూరిత భాష, నియంత్రణ లేని మాటలు ఆ పార్టీకి శాపాలుగా మారుతున్నట్టు కనిపిస్తోంది.ఉద్యమంలో ఆవేశానికి ఆదరణ దక్కింది. కానీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు బాధ్యతాయుతమైన ప్రవర్తనను ఆశిస్తారు. ఈ సున్నితమైన తేడాను బీఆర్ఎస్ విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను ఎండగట్టడానికి బీఆర్ఎస్ ఒక పక్కా చార్జ్‌షీట్‌తో సిద్ధమైంది. నల్ల చొక్కాలు ధరించి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అది కాస్తా నోటి దురుసు వల్ల దారితప్పింది.అసెంబ్లీ గేట్ వద్ద నిరసన సందర్భంగా ఉద్రిక్తత, పోలీసుల తోపులాటల వరకు ప్రజల్లో సానుభూతి బీఆర్ఎస్ వైపే ఉంది. కానీ.. ఆ ఆవేశంలో ఎమ్మెల్సీ తాతా మధు, సభా స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు మొత్తం సీన్ ను మార్చేశాయి. దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ను అవమానించారంటూ కాంగ్రెస్ దీనిని ఏకంగా దళిత ఆత్మగౌరవ సమస్యగా మార్చేసింది. సభలో స్పీకర్ భావోద్వేగానికి గురికావడం, ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడంతో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై జరగాల్సిన చర్చ కాస్తా.. బీఆర్ఎస్ నేతల భాష, సభా మర్యాదల ఉల్లంఘన చుట్టూ తిరిగేలా అధికార పార్టీ పావులు కదిపింది.ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సంయమనం కోల్పోయారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా మీడియా, పోలీసుల సమక్షంలోనే ఆయన ఉపయోగించిన తీవ్రమైన పదజాలం విమర్శలకు తావిచ్చింది. అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టినప్పుడు, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిలబడాల్సింది పోయి.. అదే ఆవేశంతో ఎదురుదాడికి దిగడంతో కాంగ్రెస్ ట్రాప్ లో బీఆర్ఎస్ పడినట్లు కనిపిస్తోంది.షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సభా ప్రాంగణం బయట కేసీఆర్ చావు కోరుకుంటున్నామని, ఎర్రవల్లి నివాసానికి చావు డప్పు కొడతామని అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి సానుభూతిగా మార్చుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైంది. అప్పటికే బీఆర్ఎస్ నేతల తిట్లు, వివాదాస్పద వ్యాఖ్యలే మీడియాలో, సోషల్ మీడియాలో హెడ్‌లైన్స్‌గా మారడమే ఇందుకు కారణం. ప్రత్యర్థి చేసిన పెద్ద తప్పు కూడా, బీఆర్ఎస్ వాడిన భాష ముందు కొట్టుకుపోయింది.ప్రభుత్వ వైఫల్యాలు, రైతు సమస్యలు, గ్యారెంటీలను గట్టిగా నిలదీసి ప్రజల దృష్టిని ఆకర్షించాల్సిన సమయంలో.. తమ నేతల అరెస్టులు, బెయిళ్లు, కేసులపై వివరణలు ఇచ్చుకోవడానికే బీఆర్ఎస్ కు సమయం సరిపోతోంది. ఎదురుదాడి చేసే క్రమంలో సంస్కారం, హుందాతనం కోల్పోతే ప్రజల్లో సానుభూతి కాస్తా అసహ్యంగా మారుతుందన్న ప్రాథమిక సూత్రాన్ని ఆ పార్టీ విస్మరిస్తోంది.

