పురావస్తు శాఖ అనుమతి రాగానే యోగా నరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణం.
జగిత్యాల జిల్లా ప్రతినిధి అర్జున్ సమాచారం సెప్టెంబర్ 6::
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
భూమి పూజకు తరలి రావాలని మంత్రి పిలుపు..
ధర్మపురి క్షేత్రంలోని శ్రీ యోగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ విస్తరణకు పురావస్తు శాఖ అనుమతి రాగానే ఆలయ విస్తరణ పనులు చేపడతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ సోమవారం తెల్లవారుజామున నిర్వహించే భూమి పూజ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్ నిర్మాణ భూమి పూజకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు భూమి పూజ కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు మంత్రి తెలిపారు.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉగ్ర నరసింహ స్వామి పునర్ నిర్మాణ పనులను గోదావరి పుష్కరాల లోపు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ధర్మపురి లోని శ్రీ యోగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పురావస్తు శాఖ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండటంతో కేంద్ర పురావస్తు శాఖ నుంచి అనుమతి రాగానే శ్రీ యోగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడతామని మంత్రి తెలిపారు.
సోమవారం తెల్లవారుజామున 2గంటల 48 నిమిషాలకు భూమి పూజ కార్యక్రమానికి ధర్మపురి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. మంత్రి వెంట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్, మండల పార్టీ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, వేముల రాజు తో పాటు ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

