భూకబ్జాలను అరికట్టే సత్తా లేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలిఎంపి ఈటల.
హైదరాబాద్. అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 24.
భూకబ్జాలను అరికట్టే సత్తా లేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఊర్లలో తాతల ఆస్తులు అమ్ముకుని తిరిగేవాన్ని తిరుగుబోతు అనేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఏర్పడింది పేదలకు ఇళ్ళ జాగాలు ఇవ్వడానికి, వ్యాపారం చేయడానికి కాదు. రెండో తారీకు ఏర్పాటు చేసిన వేలంపాటను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాని ఎంపి ఈటల రాజేందర్ అన్నారు.
సోమవారం అయన కూకట్ పల్లిలో మీడియాతో మాట్లాడారు.
ఈటల మాట్లాడుతూ
నిజాం కాలంలో 1908లో వరదలు వచ్చినప్పుడు అనేక ఇళ్లు వరదల్లో కొట్టు పోయాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. “సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్” 1911 లో నిజాం ఏర్పాటు చేసి ప్రజలకు ఇల్లు కట్టించారు. 1931 లో “సికింద్రాబాద్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్” ఏర్పాటు చేశారు. ఈ బోర్డ్ 1960 లో హౌసింగ్ బోర్డ్ గా మారింది. ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ భూములు కేటాయించడంతో పాటు రైతుల భూములు కూడా సేకరించారు. కూకట్పల్లి, కైతలాపూర్, హైదర్ నగర్ మూడు గ్రామాల పరిధిలో 1400 ఎకరాలు సేకరించారు. హౌసింగ్ బోర్డ్ ఉద్యోగులకు గజం 1 రూపాయి 25 పైసలకు ఇచ్చారు. ఆర్థిక స్తోమతను బట్టి కొనుక్కొనే విధంగా 66 గజాలు, 111 గజాలు, 311 గజాలు, 400 గజాలు ప్లాటింగ్ చేశారని అన్నారు.
జేఎన్టీయూ NTU కోసం హౌసింగ్ బోర్డ్ 100 ఎకరాలు లీజుకు ఇచ్చారు. హౌసింగ్ బోర్డ్ ఏర్పడింది పేదవారి సొంత ఇంటి కలను నెరవేర్చడానికి తప్ప వ్యాపారం చేయడానికి కాదు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005-06 లో కూకట్పల్లిలో భూముల అమ్మకాలు మొదలుపెట్టారు. మలేషియా టౌన్షిప్ కు 36 ఎకరాలు, హిందూ ప్రాజెక్ట్ కు 70 ఎకరాలు, లోధాకు 18 ఎకరాలు, ఇండీస్ వన్ సిటీకి 12 ఎకరాలు అమ్మారు.
స్కూలు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాలు, హాస్పిటల్ కట్టుకోవడానికి స్థలాలు కరువయ్యాయి. ఖాళీగా ఉన్న జాగాలను వీటికి కేటాయించండి కానీ అమ్ముకోవద్దు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. అయినా అమ్ముకుంటున్నారు. హౌసింగ్ బోర్డ్ చట్టం ప్రకారం పేదవారికి ఇళ్ళ జాగాలు ఇవ్వాలి తప్ప ఇలా అమ్ముకోవడానికి హక్కు లేదని అన్నారు.
భూకబ్జాలను అరికట్టే సత్తా లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. బస్తీలలో పని చేసుకునేవారికి ఊరు అవతల డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తే.. అక్కడ పని లేక వారు.. చేపలను నీళ్లలో నుంచి బయట వేస్తే ఎలా కొట్టుకుని చచ్చిపోతాయో.. వారి పరిస్థితి కూడా అలానే ఉంది. ఎక్కడ ఉన్నవారికి అక్కడే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలి. పేదవారికి కట్టించడానికి మనసు రావడం లేదా? పేదవారి కోసమైతే బడ్జెట్ లేదా ? ఇందిర రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అన్నది కేవలం స్లోగన్ గానే మిగిలిపోయిందని అన్నారు.

