అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు కొనసాగించడమే ఎస్‌ఐఆర్ లక్ష్యం .సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు.
అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 12, రామగిరి డెస్క్:
ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు, అవకతవకలకు తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు కొనసాగించడమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ప్రధాన లక్ష్యమని రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు తెలిపారు.
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామపంచాయతీలో శనివారం సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలో ఇంటి పేరు, పేరు, వయస్సు తదితర వివరాల్లో తేడాలు ఉంటే సంబంధిత ఆధారాలు, ధ్రువపత్రాలను సమర్పించి సరిచేసుకోవాలని సూచించారు.
ఎస్‌ఐఆర్‌లో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత గడువులోగా హియరింగ్‌కు హాజరై అవసరమైన పత్రాలు, ధ్రువపత్రాలు, సంబంధిత ఫారంతో సమర్పించాలని కోరారు. అలాగే 2002 నాటి ఓటరు జాబితాలో తమ కుటుంబ సభ్యుల వివరాలను మ్యాపింగ్ చేసుకోవాలని తెలిపారు.
నోటీసులకు స్పందించకుండా, నిర్ణీత గడువులోగా అవసరమైన పత్రాలు సమర్పించకపోతే ఓటరు జాబితాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల అర్హులైన ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హియరింగ్ తేదీన సంబంధిత ఆధారాలతో హాజరుకావాలని తెలిపారు.
గ్రామసభలో ఓటర్లు అడిగిన పలు సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఓటరు వివరాల సవరణ, అవసరమైన ధ్రువపత్రాలు, హియరింగ్ ప్రక్రియ తదితర అంశాలను వివరించారు. ఏవైనా సందేహాలు ఉంటే గ్రామపంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగుల సంతోష్‌కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

