సూర్యాపేట:
అర్జున్ సమాచారం:
సూర్యాపేట జిల్లాతో పాటు నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లలో దొంగతనాలు, వైన్స్ షాపుల్లో మద్యం చోరీలు, వ్యవసాయ బావుల వద్ద సబ్‌మర్సిబుల్ మోటార్లు, కరెంట్ వైర్లు చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను ఆత్మకూర్ (ఎస్) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.20లక్షల విలువైన నగదు, బంగారు–వెండి ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యవసాయ పరికరాలు, మద్యం సీసాలు, వాహనాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ తెలిపారు.
గత ఆగస్టు 30వ తేదీ రాత్రి ఆత్మకూర్ (ఎస్) మండలం పాత సూర్యాపేట గ్రామానికి చెందిన బొక్క వెంకట్ రెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో వ్యవసాయ మోటార్, కేబుల్ వైర్, సీసీ కెమెరా హార్డ్ డిస్క్, ఇన్వర్టర్, బ్యాటరీ, బంగారు ఆభరణాలు, నగదు తదితర వస్తువులు చోరీకి గురయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆత్మకూర్ (ఎస్) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు తెల్లవారుజామున పాత సూర్యాపేట X రోడ్డు వద్ద, సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై ఆత్మకూర్ (ఎస్) ఎస్సై ఎం. ఐలయ్య తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించారు. మూడు మోటార్ సైకిళ్లపై ఐదుగురు వ్యక్తులు ఒక వ్యవసాయ మోటార్‌ను తీసుకుని అనుమానాస్పదంగా వెళ్తుండటాన్ని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా పాత సూర్యాపేటకు చెందిన సురికంటి నరేష్ @ నరేష్ రెడ్డి, మేరెడ్డి మహిపాల్ రెడ్డి @ ప్రీతం రెడ్డి, పన్నాల గిరిధర్ రెడ్డి, శివరాత్రి అరవింద్ @ అరుణ్, కాసాల ఉదయ్ కిరణ్ రెడ్డి @ కిరణ్ రెడ్డిగా గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితులు గత సంవత్సరం కాలంగా గ్రూపుగా ఏర్పడి సూర్యాపేట జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో, అలాగే నల్లగొండ జిల్లా నకిరేకల్ పరిధిలో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
====================

