మెదక్,అర్జున్ సమాచారం:
శనివారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ , జిల్లా అటవీ సంరక్షణ కమిటీ చైర్మన్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి , పోలీస్ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో అడవుల సంరక్షణకు ,పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
జిల్లాలో అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా కఠినమైన నిఘా ఏర్పాటు చేయాలని, సరిహద్దులను జియో-ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షించాలని నిర్ణయించారు.
పోడు భూముల సమస్యలు, అక్రమ కలప రవాణా వన్యప్రాణుల వేటను అరికట్టడానికి అటవీ , పోలీస్ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు.
అటవీ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు, యువతకు అడవుల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సులు నిర్వహించాలని,
అటవీ సంరక్షణలో వారిని భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా అటవీ శాఖ అధికారి జో జి మాట్లాడుతూ..అటవీ చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అడవుల రక్షణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ వో అంబాదాస్ రాజేశ్వర్,జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నీలిమ ,డిఎస్పీ ప్రసన్న కుమార్, ఫారెస్ట్ రేంజ్ అధికారులు పాల్గొన్నారు.

