ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeతెలంగాణభద్రాద్రిఆరోగ్యకరమైన అలవాట్లు – ఆనందకర బాల్యం - రుద్రంపూర్‌లో జాతీయ నులి పురుగుల నివారణ...

ఆరోగ్యకరమైన అలవాట్లు – ఆనందకర బాల్యం – రుద్రంపూర్‌లో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవ ర్యాలీ

📰 Generate e-Paper Clip

కొత్తగూడెం,అర్జున్ సమాచారం:
పిల్లల్లో నులి పురుగుల సమస్యను నివారించి, వారి ఆరోగ్యవంతమైన ఎదుగుదలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 13న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవంను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, యువతకు అల్బెండజోల్ మాత్రలను ఉచితంగా అందజేయనుంది. ఇందులో భాగంగా చుంచుపల్లి మండలం, రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులచే మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఏ.నాగ కుమారి ఆధ్వర్యంలో శ‌నివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నులి పురుగులు కలుషిత ఆహారం, నీరు, పరిశుభ్రత లోపం వల్ల శరీరంలోకి ప్రవేశించి పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, కడుపు నొప్పి, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలకు దారితీస్తాయ‌న్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు ఆరోగ్య శాఖ సూచించిన మేరకు నులి పురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఆరోగ్య నిపుణులు సూచించిన ముఖ్య జాగ్రత్తల్లో భోజనానికి ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవడం, గోళ్లను శుభ్రంగా ఉంచుకోవడం, చెప్పులు ధరించడం, మరుగుదొడ్లను వినియోగించడం, సురక్షితమైన తాగునీరు సేవించడం, ఆహారాన్ని పరిశుభ్రంగా తయారు చేసి, మూతపెట్టి ఉంచడం ఉన్నాయి. అలాగే నులిపురుగుల నివారణ మాత్రలు పూర్తిగా సురక్షితమైనవని, అవి పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని వైద్యాధికారులు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా మాత్ర వేయించి, ఆరోగ్యవంతమైన భవిష్యత్‌కు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. “ఆరోగ్యకరమైన అలవాట్లు – ఆనందకర బాల్యం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆరోగ్య శాఖ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ సుభద్రమ్మ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సత్యవతి, టీచర్‌ రాజరాజేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!