ePaper
Thursday, October 8, 2026
ePaper
Homeతెలంగాణభద్రాద్రిఇసుక రవాణాలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు మణుగూరు, చర్ల, భద్రాచలం, బూర్గంపాడుపై...

ఇసుక రవాణాలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు మణుగూరు, చర్ల, భద్రాచలం, బూర్గంపాడుపై ప్రత్యేక దృష్టి హోల్డింగ్, పార్కింగ్ ప్రాంతాలను సద్వినియోగం చేసుకోవాలి అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తప్పవు

📰 Generate e-Paper Clip

 అర్జున్ సమాచారం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:

జిల్లాలో పెరుగుతున్న ఇసుక రవాణా కారణంగా ప్రజలకు, ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి బుధవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో ఇసుక రవాణా, వాహనాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, అక్రమ ఇసుక రవాణా తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇసుక వాహనాల రాకపోకలు అధికంగా ఉన్న మణుగూరు, చర్ల, భద్రాచలం, బూర్గంపాడు ప్రాంతాల్లో రోడ్ల సామర్థ్యం, ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వాహనాల ఎంట్రీ, ఎగ్జిట్‌లను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఒకేసారి భారీ సంఖ్యలో లారీలు రోడ్లపైకి రాకుండా అవసరానికి అనుగుణంగా దశలవారీగా వాహనాలను పంపించే విధంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

హోల్డింగ్ ప్రాంతాల వినియోగం

మణుగూరు, రామాంజవరం ప్రాంతాల్లో అవసరమైన హోల్డింగ్, పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. చర్ల–భద్రాచలం మార్గంలో భారీ వాహనాల రాకపోకల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టాలని సూచించారు. భద్రాచలం రహదారి మరమ్మతుల నాణ్యతను తక్షణమే పరిశీలించి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
బూర్గంపాడు పరిధిలోని గొల్లగూడెం, సారపాక బ్రిడ్జి, తాళ్లగూడెం, ఉప్పాక, పినపాక పట్టినగర్ తదితర ప్రాంతాల్లో ఇసుక రవాణా వల్ల ఏర్పడుతున్న సమస్యలను గుర్తించి ప్రత్యామ్నాయ పార్కింగ్, హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ట్రాఫిక్ మార్షల్స్‌ పెంపు

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ ఇసుక రవాణా అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా అదనపు ట్రాఫిక్ మార్షల్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. మణుగూరు, చర్ల ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా టీజీఎండీసీ అధికారులతో సమన్వయం చేసుకుని వాహనాల సాఫీ రాకపోకలకు చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఒకేసారి అధిక సంఖ్యలో వాహనాలు వచ్చినప్పుడు వాటిని నియంత్రించేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం

ఆంధ్రప్రదేశ్‌ నుంచి జిల్లాలోకి అక్రమంగా ఇసుక రవాణా జరిగే అవకాశాలను అడ్డుకునేందుకు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ సూచించారు. సీజ్ చేసిన ఇసుకను అక్కడే నిల్వ ఉంచకుండా తదుపరి చర్యల కోసం తరలించేలా ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేయాలని తెలిపారు.
అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వాహనాలు, జేసీబీలపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు.

సమన్వయంతోనే సమస్యకు పరిష్కారం

ఇసుక రవాణా, ట్రాఫిక్ నిర్వహణ, అక్రమ ఇసుక రవాణా నియంత్రణలో పోలీసు, రెవెన్యూ, టీజీఎండీసీ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డీఆర్వో పద్మావతి, కొత్తగూడెం ఆర్డీవో మధు, ఏడీ మైన్స్ దినేష్, జిల్లా రవాణా శాఖ అధికారి భూషిత్ రెడ్డి, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
=============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!