ePaper
Friday, August 21, 2026
ePaper
Homeతెలంగాణరంగారెడ్డిఐటీ పార్క్ నిర్మించాల్సిన చోట డంప్ యార్డా? సిద్దాపూర్ డంప్ యార్డు జీవోను...

ఐటీ పార్క్ నిర్మించాల్సిన చోట డంప్ యార్డా? సిద్దాపూర్ డంప్ యార్డు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి.. లేనిపక్షంలో బాధిత రైతుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది. -మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరిక

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం   : రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్‌లో డంప్ యార్డు ఏర్పాటు నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న స్థానిక రైతులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. డంప్ యార్డు వల్ల తాము ఏ విధంగా నష్టపోతున్నామో వివరిస్తూ ఆయన ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పక్షాన పోరాడాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. రైతుల వినతిపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో 86 ఎకరాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నం. 641 తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన చర్య.

పచ్చని వ్యవసాయ భూముల మధ్య, జనావాసాలకు సమీపంలో డంప్ యార్డు ఏర్పాటు చేయాలనుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనం. ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.

సిద్దాపూర్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న దాదాపు 20 గ్రామాలు ఈ డంప్ యార్డు వల్ల తీవ్రంగా నష్టపోతాయి. ఈ గ్రామాల ప్రజలంతా పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి అవసరమైన కూరగాయలను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. డంప్ యార్డు ఏర్పాటు చేయాలనుకుంటున్న స్థలానికి ఆనుకుని ఉన్న ‘గుట్ట చెరువు’ నీటితోనే ఈ ప్రాంత రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు.

ఇప్పుడు ఆ చెరువు పక్కనే డంప్ యార్డు పెడితే ఆ నీరు పూర్తిగా కలుషితమై, సాగు నీటితో పాటు తాగునీటికీ తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. అంతేకాకుండా ఎంతో ప్రసిద్ధి చెందిన జహంగీర్ పీర్ దర్గా కూడా ఇక్కడే ఉండటంతో, ఆ కాలుష్యం స్థానికులతో పాటు భక్తులకు కూడా శాపంగా మారడం ఖాయం.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదే ప్రాంతంలో, డంప్ యార్డుకు కేటాయించిన సర్వే నంబర్లు 252, 278, 361లో ఉన్న 334 ఎకరాల్లో ఐటీ పార్క్ నిర్మించాలని మేము ప్రణాళికలు రూపొందించాం. ఇక్కడ ఐటీ పార్క్ వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ సంకల్పించింది.

కానీ, ఉపాధి కల్పించాల్సిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం డంప్ యార్డు ఏర్పాటు చేసి స్థానిక ప్రజల బతుకులను చిదిమేయాలని చూడటం శోచనీయం. యువతకు అవకాశాలు కల్పించాల్సిన చోట కాలుష్యాన్ని, రోగాలను ఇవ్వడమే ప్రజాపాలనా?

ప్రభుత్వం డంప్ యార్డులను ఏర్పాటు చేయాలనుకుంటే ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగని చోట, జనావాసాలు, గ్రామాలు లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. కానీ ఇలా పచ్చని పల్లెలను, పొలాలను, రైతులను ఆగమాగం చేయడం ఏమాత్రం తగదు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిద్దాపూర్ డంప్ యార్డు నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో నష్టపోతున్న ఆ 20 గ్రామాల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని, స్థానిక రైతులకు అండగా నిలబడి పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!