రంగారెడ్డి,అర్జున్ సమాచారం:
షాద్‌నగర్ నియోజకవర్గ పరిధి కిషన్ నగర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణభయంతో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. పైకప్పు, గోడలు దెబ్బతినడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది.నాలుగు రోజుల క్రితం పాఠశాలలోని ఒక గదిలో పైపెచ్చు ఊడి ఆయమ్మ మెడపై పడటంతో ఆమె గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన ఘటన
చోటుచేసుకుంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు శాశ్వత చర్యలు చేపట్టకపోవడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వర్షం పడితే గది బయటే…
సాధారణంగా వర్షం పడితే విద్యార్థులు తరగతి గదుల్లోనే ఉంటారు. కానీ కిషన్ నగర్ పాఠశాలలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వర్షం పడిన సమయంలో పైపెచ్చులు ఊడిపడే ప్రమాదం ఉండటంతో విద్యార్థులను గదుల నుంచి బయటకు పంపాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా వర్షపు నీరు గదుల్లోకి చేరి విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది.
పాఠశాల ఆవరణలో కోతుల బెడద
పాఠశాల ఆవరణలో తరచూ కోతులు సంచరిస్తుండటంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మధ్యాహ్న భోజనం లేదా విరామ సమయంలో బయటకు వచ్చినప్పుడు కోతులు వెంటపడుతున్నాయని విద్యార్థులు తెలిపారు. కోతుల బెడద నుంచి తమను రక్షించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తల్లిదండ్రుల ఆవేదన
“ప్రైవేట్ పాఠశాలలు వద్దు… ప్రభుత్వ పాఠశాలలే ముద్దు” అనే నమ్మకంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నామని, కానీ ఇప్పుడు ప్రతిరోజూ ప్రాణభయంతోనే పిల్లలను పంపాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. శిథిలావస్థలో ఉన్న భవనంలో చదువు చెప్పడం ప్రమాదకరమని, వెంటనే నూతన పాఠశాల భవనం నిర్మించి విద్యార్థులకు సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.
=============================

